KTR Tweet On Farmers Problems :కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతులంటే ఎందుకంత చిన్నచూపని ప్రశ్నించారు. రాష్ట్రంలో పంటపొలాలు, రైతుల ఇక్కట్లపై ఆయన 'ఎక్స్' వేదికగా స్పందించారు. 'నిన్న పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదు, నేడు వడగండ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటం లేదు' అని విమర్శించారు.
అన్నదాతల ఆర్తనాదాలు వినిపించవా : కేటీఆర్
దిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేయడం తప్ప గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా?అన్నదాతల ఆర్తనాదాలు వినిపించవా? అని కేటీఆర్ నిలదీశారు. ఎన్నికల గోల తప్ప ఎన్నో కష్టాలు పడుతున్న రైతులపై కనికరం లేదా అని ప్రశ్నించారు. సీట్లు, ఓట్ల పంచాయితీ తప్ప అన్నదాతల ఆత్మహత్యలు పట్టవా అని ముఖ్యమంత్రినిఅడిగారు. ప్రజాపాలన అంటే నిత్యం ఫక్తు రాజకీయమేనా? పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి పంట నష్టంపై ఎందుకు లేదని విమర్శించారు.
మూగజీవాలకు పశుగ్రాసం ఎక్కడ దొరికేను?
"పాడైపోయిన పంటలను పరిశీలించే తీరిక సీఎంకు లేదా? హైకమాండ్ చుట్టూ చక్కర్లు కొట్టీ కొట్టీ రైతుల సమస్యలు వినే ఓపికలేదా? ఇంతకాలం పచ్చని పైర్లు ఎండుతున్నా సాగునీరు ఇవ్వడం చేతకాలేదు. ఇప్పుడు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలన్నా మనసు రావడం లేదా మీకు. ఎద్దేడ్సిన ఎవుసం..! రైతేడ్సిన “రాజ్యం బాగుండదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై భారత "రైతు" సమితి పోరాడుతూనే ఉంటుంది"- కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు
Harish Rao Tweet On Crop Damage :మరోవైపు ఇటీవల ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వానవల్లపంటలు నష్టపోవడంపై(Crop Damage) మాజీ మంత్రి హారీశ్ రావు సామాజిక మాధ్యమం(Social Media) ఎక్స్ వేదికగా స్పందించారు. జరిగిన నష్టాన్ని తక్షణమే అంచనా వేయడంతో పాటు ఎకరాకు రూ.10వేల పరిహారాన్ని చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.