BRS Working President KTR Chitchat With Media : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ, మోసాలు కాంగ్రెస్ అధిష్టానానికి తెలుసని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు కోసం కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని, బీజేపీ వ్యతిరేక ఓటు చీలాలన్నది కాంగ్రెస్ ఆలోచన అని ఆయన అన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో మీడియా ప్రతినిధులతో కేటీఆర్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాష్ట్రంలో ఏడాదిగా మోసాల పరంపర కొనసాగుతోందని, హర్యానా, మహారాష్ట్రలోని ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మలేదని అన్నారు.
కేజ్రీవాల్ కోసం రాహుల్ సభ : ఎన్నికైన మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మోసాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గ్యారంటీలు కాదు, గారడీలను ప్రజలు తిరస్కరించారని కేటీఆర్ అన్నారు. దిల్లీలో కూడా కాంగ్రెస్‌ను తిరస్కరిస్తారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో అరవింద్ కేజ్రీవాల్ కోసం రాహుల్ గాంధీ సభ కూడా పెట్టారని, ఇప్పుడు కేజ్రీవాల్ స్కాములు అని రేవంత్ రెడ్డి అంటున్నారని ఆక్షేపించారు. సోనియా, రాహల్, ప్రియాంక గాంధీని తెలంగాణ ప్రజలు నమ్మి ఓట్లు వేశారని కేటీఆర్ మండిపడ్డారు.
బీసీ డిక్లరేషన్‌పై మల్లగుల్లాలు : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా నిర్వహిస్తారన్న కేటీఆర్, బీసీ డిక్లరేషన్, స్కాముల గురించి బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. స్వయంగా ప్రధాని ఆర్ఆర్ ట్యాక్స్ అని చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరిస్థితి ఏంటో తెలుసుకోవాలని, సొంత కాంగ్రెస్ కార్యకర్తను హత్య చేస్తే దిక్కులేదని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
తెలంగాణ ప్రజలు ముమ్మాటికీ నిలదీయాల్సింది దిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానాన్నేనని ధ్వజమెత్తారు. హిమాచల్‌ప్రదేశ్ తరహాలో దేశం అంతటా గంజాయి సాగు తీసుకొస్తారేమోనని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎన్నికల కోసమే రైతు భరోసా నాటకం అన్న ఆయన కేసీఆర్ చెప్పినట్లు ఎన్నికలు అయిపోగానే రైతులకు సాయం నిలిపివేస్తారని తెలిపారు. బీఆర్ఎస్కు ఆయువుపట్టు రైతులేనని, వారి తరఫున నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు.