తెలంగాణ

telangana

ETV Bharat / politics

చార్మినార్​ చిహ్నమంటే మీకెందుకంత చిరాకు - కాకతీయ కళాతోరణం అంటే ఎందుకంత కోపం : కేటీఆర్​ - KTR Tweet on CM Revanth Reddy

KTR Tweet on Telangana Symbol Changes : చార్మినార్​ చిహ్నంటే మీకెందుకంత చిరాకు, కాకతీయ కళాతోరణం అంటే ఎందుకంత కోపమని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ సీఎం రేవంత్​ను ప్రశ్నించారు. ఇదేం రెండు నాల్కల వైఖరి? ఇదెక్కడి మూర్ఖపు ఆలోచన అంటూ సీఎం రేవంత్​రెడ్డిపై కేటీఆర్​ ఎక్స్​ వేదికగా మండిపడ్డారు. రాజకీయ ఆనవాళ్లను తొలగించాలన్న కక్షతో రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని చెరిపేస్తే సహించమని హెచ్చరించారు.

KTR Tweet on Telangana Symbol Changes
KTR Tweet on Telangana Symbol Changes (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 28, 2024, 5:05 PM IST

KTR Tweet on CM Revanth Reddy : రాజకీయ ఆనవాళ్లను తొలగించాలన్న కక్షతో రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని చెరిపేస్తే సహించబోమని, పౌరుషానికి ప్రతీకైన ఓరుగల్లు సాక్షిగా ప్రభుత్వ సంకుచిత నిర్ణయాలపై సమరశంఖం పూరిస్తామని బీఆర్​ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ హెచ్చరించారు. తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పారు. ఇదేం రెండు నాల్కల వైఖరి? ఇదెక్కడి మూర్ఖపు ఆలోచన అంటూ ఎక్స్​ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు.

కాకతీయ కళాతోరణంపై ఎందుకంత కోపం? చార్మినార్​ చిహ్నం అంటే మీకెందుకంత చిరాకు అని ఎక్స్​ వేదికగా సీఎం రేవంత్​ రెడ్డిని కేటీఆర్​ అడిగారు. అవి రాచరికపు గుర్తులు కావని, వెయ్యేళ్ల సాంస్కృతిక వైఖవానికి చిహ్నాలు అని చెప్పారు. వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలని కేటీఆర్​ పేర్కొన్నారు. జయజయహే తెలంగాణ గీతంలో ఏముందో తెలుసా అని ప్రశ్నించారు. కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప అనీ, గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్​ అని తెలిపారు. అధికారిక గీతంలో కీర్తించి! అధికారిక చిహ్నంలో మాత్రం అవమానిస్తారా అంటూ ప్రశ్నించారు.

చార్మినార్​ అంటే కట్టడం కాదు : చార్మినార్​ అంటే ఒక కట్టడం కాదని విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్​కు ఐకాన్​ అన్న ఆయన, కాకతీయ కళాతోరణం అంటే ఒక నిర్మాణం కాదని సిరిసంపదలతో వెలుగొందిన ఈ నేలకు నిలువెత్తు సంతకమని కేటీఆర్​ వివరించారు. తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి వీటిని తొలగించడమంటే తెలంగాణ చరిత్రను చెరిపేయడమే అని కేటీఆర్​ ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెలను గాయపరచడమేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్​ పాలిస్తున్న కర్ణాటక అధికారిక చిహ్నంలోనూ రాచరికపు గుర్తులున్నాయని చెప్పారు. మరి వాటిని కూడా తొలగిస్తారా, లేదా చెప్పాలంటూ ప్రశ్నించారు.

అసెంబ్లీని కూల్చేస్తారా? : భారత జాతీయ చిహ్నంలోనూ అశోకుడి స్తూపం నుంచి స్వీకరించిన మూడు సింహాలున్నాయని, జాతీయ పతాకంలోనూ దశాబ్దాలుగా ధర్మచక్రం ఉందని, వాటి సంగతేంటో సమాధానం ఇవ్వండని కేటీఆర్​ సీఎం రేవంత్​ను ప్రశ్నించారు. కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులను పూడ్చేస్తారా? ఒకప్పుడు రాచరికానికి చిహ్నంగా ఉన్న అసెంబ్లీని కూల్చేస్తారా అని అడిగారు. నేడు తెలంగాణ గుర్తులు మారుస్తామంటున్నారు. రేపు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సరిహద్దులు చెరిపేస్తారా అంటూ ప్రశ్నించారు.

రాజకీయ కక్షతో చిహ్నాన్ని చెరిపేస్తే ఊరుకోం : గత పదేళ్లుగా ప్రభుత్వ అధికారిక చిహ్నంగా యావత్​ తెలంగాణ సమాజం ఆమోద ముద్ర ఉందని, సబ్బండ వర్ణాల మనసు గెలుచుకున్న సంతకమూ ఉందని కేటీఆర్​ పేర్కొన్నారు. రాజకీయ ఆనవాళ్లను తొలగించాలన్న కక్షతో రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని చెరిపేస్తే సహించబోమని హెచ్చరించారు. పౌరుషానికి ప్రతీకైన ఓరుగల్లు సాక్షిగా మీ సంకుచిత నిర్ణయాలపై సమరశంఖం పూరిస్తామని తెలిపారు. తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని కేటీఆర్​ సీఎం రేవంత్​రెడ్డికి సవాల్​ విసిరారు.

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌ - దేశ చరిత్రలో ఇది అసామాన్య విజయగాథ : కేటీఆర్

ఆర్టీసీ కొత్త లోగో చూపుతున్న కాంగ్రెస్ వాళ్లపై కేసులేవీ : కేటీఆర్‌ - KTR Tweet Today

ABOUT THE AUTHOR

...view details