Vedire Sriram about NDSA Committee Report : అవసరమైన పరీక్షలు పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వం వివరాలు అందించకపోవడం వల్లే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ నివేదిక ఆలస్యం అవుతోందని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం తెలిపారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరైన ఆయన కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై అఫిడవిట్ సమర్పించారు. గతంలో కమిషన్కు చెప్పిన అంశాలను ఇవాళ అఫిడవిట్ రూపంలో అందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రణాళిక మొదలు మేడిగడ్డ ఆనకట్ట పియర్స్ కుంగిన వరకు అన్ని అంశాలను అఫిడవిట్‌లో పొందుపరిచినట్లు తెలిపిన ఆయన, ఇటీవలి పరిణాణాలను కూడా పేర్కొన్నట్లు చెప్పారు.
ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ నివేదిక అంశం కూడా ప్రస్తావనకు వచ్చిందన్న శ్రీరాం, నివేదిక ఆలస్యానికి గల కారణాలను కమిషన్కు వివరించినట్లు తెలిపారు. ఎన్డీఎస్ఏ చెప్పిన పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పూర్తి చేయలేదని అన్నారు. ఎన్డీఎస్ఏ సిఫారసు చేయనప్పటికీ రాష్ట్ర ఇంజినీర్లు బ్యారేజీ కింద ఉన్న గుంతల్ని పూడ్చివేశారని, దీంతో బ్యారేజీల కింద జియో టెక్నికల్ డేటాను కోల్పోయినట్లు వివరించారు. ఇదే విషయాన్ని ఎన్డీఎస్ఏ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసిందని తెలిపారు. జియో టెక్నికల్ పరీక్షలు ఇక సాధ్యం కాదని, కొన్ని చోట్ల జియో ఫిజికల్ పరీక్షలు చేసి, వివరాలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు వివరించారు. ఎన్డీఎస్ఏకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా డేటా అందలేదని, డేటా అందిన తర్వాత రెండు నెలలకు నివేదిక ఇస్తామని ఎన్డీఎస్ఏ తెలిపిందని వెదిరె శ్రీరాం పేర్కొన్నారు.
'ఎన్‌డీఎస్‌ఏ చెప్పిన పరీక్షలను ప్రభుత్వం పూర్తి చేయలేదు. రాష్ట్ర ఇంజినీర్లు బ్యారేజీ కింద గుంతలను పూడ్చివేశారు. బ్యారేజీల కింద జియో టెక్నికల్ డేటా కోల్పోయాం. జియో టెక్నికల్ సాధ్యం కాదని ఎన్డీఎస్ఏ చెప్పింది' - వెదిరె శ్రీరాం, కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు
బ్యారేజీల నిర్మాణ స్థలాలు మారాయి : మరోవైపు ఇవాళ కాళేశ్వరం కమిషన్ 15 మంది ఇంజినీర్లు హాజరయ్యారు. నీటిలభ్యత పరీక్షల నివేదికలు పూర్తికాకముందే బ్యారేజీల నిర్మాణం మొదలుపెట్టినట్లు కమిషన్ ముందు వెల్లడించారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ స్థలాలు కూడా మారినట్లు తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ చేపట్టిన జస్టిస్ పీసీ ఘోష్, వాస్తవాలు దాచిపెట్టి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయవద్దని ఇంజినీర్లకు సూచించారు.
తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటానని జస్టిస్ పీసీ ఘోష్ హెచ్చరించారు. జరిగిన, చూసిన, చేసిన పని గురించి వాస్తవాలు చెప్పడానికి ఎందుకంత ఇబ్బందని వ్యాఖ్యానించారు. రాష్ట్రస్థాయిలో జరిగిన విషయాలను కేంద్రానికి ఆపాదించే ప్రయత్నం చేయవద్దన్న ఆయన, అఫిడవిట్‌లో ఉన్న అంశాలు క్షేత్రస్థాయిలో లేవని ఇంజినీర్లను ప్రశ్నించారు. ఇంజినీర్లు చిత్తశుద్ధితో పనిచేస్తే బ్లాకులు ఎందుకు కొట్టుకుపోయాయని నిలదీశారు. ఇప్పటి వరకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సుమారు 90 మంది ఇంజినీర్లను విచారించింది.
ప్రమాణం చేసి మరీ అబద్ధాలు చెబుతారా? : ఇంజినీర్లపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫైర్