Crowds At The Fish Market Have Increased Due to Bird Flu : బర్డ్ ఫ్లూ సోకి కోళ్లు చనిపోతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా కొంతమంది ప్రజలు చికెన్ తినేయడం మానేస్తున్నారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో చేపలు, మటన్ షాపుల వద్ద జనం క్యూ కట్టారు. దీంతో చికెన్ వ్యాపారులు కస్టమర్లు లేక దుకాణాల్లో ఖాళీగా కూర్చుంటున్నారు. మరోవైపు చేపలు, మటన్ అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో చేపల రేట్లు ఒక్కసారిగా పెంచి అందినకాడికి స్వాహా చేస్తున్నారు వ్యాపారులు. గతంలో కిలో మటన్ ధర రూ.700 నుంచి 800కు విక్రయించేవారు. ప్రస్తుతం రూ.50 నుంచి రూ.100 వరకు పెంచి అమ్ముతున్నారు. మాంసం ప్రియులు ఏమీ చేయలేక కొనుగోలు చేస్తున్నారు.
అదే విధంగా చేపల రేట్లను కూడా పెంచి విక్రయిస్తున్నారు. రూ.150 నుంచి 160కు అమ్మే బొచ్చ, రవ్వ రకం చేపలను ఏకంగా రూ.200 కేజీగా అమ్ముతున్నారు. మధ్య తరగతి కుటుంబాలపై ఈ ధరలు ప్రభావం చూపుతున్నాయి. మొత్తానికి కోడికి వచ్చిన రోగానికి మాంస ప్రియుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.
కిక్కిరిసిపోయిన జనం : మరోవైపు హైదరాబాద్ పలు చేపల మార్కెట్లు కిటకిటలాడాయి. రాంనగర్‌లోని చేపల మార్కెట్లో జనాలు కిక్కిరిసిపోయారు. కొత్తపేటలోని చేపల మార్కెట్లో ఉదయం నుంచి చేపల విక్రయాలు భారీగా జరుగుతున్నాయి. బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ కొనుగోళ్లు తగ్గించిన జనం చేపలు, మటన్ తీసుకుంటున్నారు.