BRS MLC Kavitha On Students Deaths : గురుకుల పాఠశాలల విద్యార్థుల ప్రాణాలు కాపాడేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం 10 నిమిషాలైనా సమయం కేటాయించాలని, ఫుడ్ పాయిజన్ కరెంట్ షాక్, ఆత్మహత్యలతో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. శనివారం నిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వాంకిడి రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని శైలజను కవిత పరామర్శించారు. వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు.
ప్రభుత్వం ఎందుకు దృష్టిసారించట్లేదు : ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో 11 నెలల కాంగ్రెస్ పాలనలో 42 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం కలచి వేస్తుందన్నారు. అన్ని సంక్షేమ శాఖలను తన వద్ద ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు విద్యార్థుల మరణాలపై దృష్టి సారించడం లేదంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గురుకుల పాఠశాలను ఉన్నతంగా తీర్చిదిద్ది విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన వసతులు కల్పించామని, కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకుల పాఠశాలలు అధ్వాన్నంగా తయారయ్యాయని ఆమె మండిపడ్డారు.
రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : నారాయణపేట్ పాఠశాలలో అన్నంలో పురుగులు రావడంపై సీఎం సమీక్ష జరిపిన మరుసటి రోజే మళ్లీ అలాంటి సంఘటన పునరావృతం కావడంపై కవిత మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులు ఉన్నత చదువుల కోసం పాఠశాలలో చేరే వాళ్ళని ఇప్పుడు ప్రాణాలు కోల్పోవడానికి చేరుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ కారణాలతో మృతి చెందిన విద్యార్థులకు తక్షణం రూ.10 లక్షల పరిహారం చెల్లించడంతో పాటు వారి కుటుంబాలకు అండగా నిలవాలని కవిత ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
"చాలా బాధతో కూడిన పరామర్శ ఇది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలవుతుంటే నెలకు సరాసరిన 3 మంది లెక్కన ఇప్పటికే 42 మంది బిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి వాళ్లు కేవలం సర్కారు నిర్లక్ష్యంతోనే చనిపోవడం జరిగింది. అన్ని సంక్షేమ శాఖలు కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉండటంతోనే వారు సమయం వెచ్చించలేకపోతున్నట్లుగా కనిపిస్తోంది. ఒక్క పది నిమిషాలు మీరు పాఠశాలలు, పసిబిడ్డలు గురించి ఆలోచించి సమీక్ష చేసినట్లయితే వారి ప్రాణాలు కాపాడినట్లుగా ఉంటుంది"- కవిత, ఎమ్మెల్సీ
ఆడబిడ్డకో న్యాయం.. అదానీకో న్యాయమా ? : ఎక్స్ వేదికగా ప్రశ్నించిన కవిత