What Is Credit Card Churning : మనలో చాలా మంది రివార్డ్ పాయింట్లు, బోనస్‌లు, ఆఫర్లు, డిస్కౌంట్ల కోసం క్రెడిట్ కార్డులను వాడుతుంటారు? ఇందుకోసం కొందరు తరచూ క్రెడిట్ కార్డులను మారుస్తూ ఉంటారు. దీనినే క్రెడిట్ కార్డ్ చర్నింగ్ అని అంటారు. మరి మీరు కూడా ఇలానే చేస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. క్రెడిట్ కార్డ్ చర్నింగ్ వల్ల కలిగే లాభనష్టాల గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
Credit Card Churning Benefits
- క్రెడిట్ కార్డ్ చర్నింగ్ అనేది ఒక స్ట్రాటజిక్ మెథడ్. ఈ పద్ధతి ఉపయోగించి ఒక క్రెడిట్ కార్డును ఓపెన్ చేసి, దాని ద్వారా వచ్చే జాయినింగ్ బోనస్, రివార్డ్ పాయింట్స్, క్యాష్‌బ్యాక్స్ సహా అన్ని రకాల బెనిఫిట్స్ పూర్తిగా ఉయోగించుకుంటారు. తరువాత ఆ కార్డును క్లోజ్ చేసి, మరో కొత్త క్రెడిట్ కార్డ్ తీసుకుంటారు. ఈ విధంగా షాపింగ్, డైనింగ్, ట్రావెల్స్‌పై భారీగా డబ్బులు ఆదా చేసుకుంటారు.
- ఇంకా క్రెడిట్ కార్డ్ చర్నింగ్ ద్వారా ప్రయాణాలు చేసేటప్పుడు, ఉచితంగా ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందవచ్చు. హోటల్లో స్టే చేయవచ్చు. ఆన్లైన్ షాపింగ్, మూవీ టికెట్స్‌పై డిస్కౌంట్స్ పొందవచ్చు.
- మీ దగ్గర కనుక మల్టిపుల్ క్రెడిట్ కార్డులు ఉన్నట్లయితే, అత్యధికంగా డిస్కౌంట్స్, ఆఫర్స్ అందించే క్రెడిట్ కార్డును వాడుకోవచ్చు.
Credit Card Churning Disadvantages
క్రెడిట్ కార్డ్ చర్నింగ్ వల్ల కొన్ని రిస్క్‌లు కూడా ఉంటాయి. అవి ఏమిటంటే?
- సాధారణంగా చాలా క్రెడిట్ కార్డ్‌ల యాన్యువల్, జాయినింగ్ ఫీజులు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల మీకు సైనప్-బోనస్ రూపంలో వచ్చిన బెనిఫిట్స్ కంటే వీటి ఖర్చే ఎక్కువ అవుతుంది.
- తక్కువ సమయంలో ఎక్కువ సంఖ్యలో క్రెడిట్ కార్డులను మారుస్తూ ఉంటే, అది మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది.
- ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడడం వల్ల మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో కూడా పెరిగి, కొత్త క్రెడిట్ కార్డ్ మంజూరు అయ్యే ఛాన్స్ తగ్గుతుంది.
- కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డ్ చర్నింగ్ను ఏమాత్రం అనుమతించవు. కనుక నిర్దేశిత సమయం వరకు కొత్త క్రెడిట్ కార్డులు పొందడం కష్టమవుతుంది. ఒకవేళ కొత్తది తీసుకున్నా, దానిపై వచ్చే బెనిఫిట్స్ తగ్గిపోతాయి.
- క్రెడిట్ కార్డులు ఉపయోగించేవాళ్లు కచ్చితంగా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. లేకుంటే భారీగా అప్పులపాలయ్యే అవకాశం ఉంటుంది. అందుకే క్రెడిట్ కార్డు చర్నింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
క్రెడిట్ కార్డ్ చర్నింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
1. క్రెడిట్ కార్డ్ చర్నింగ్ చేసేముందు కచ్చితంగా మార్కెట్లో ఉన్న అన్ని రకాల క్రెడిట్ కార్డుల గురించి రీసెర్చ్ చేయాలి. వాటిలో ఎక్కువ మొత్తంలో సైనప్ బోనస్‌లు, రివార్డ్ పాయింట్లు, బెనిఫిట్స్ ఇచ్చే కార్డ్‌ను ఎంచుకోవాలి.
2. తరవాత మీ ఆర్థిక స్థితికి తగిన మంచి క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
3. మీ అత్యవసరాల కోసం మాత్రమే ఆ క్రెడిట్ కార్డులను ఉపయోగించుకోవాలి. క్రెడిట్ కార్డ్ ఉంది కదా అని అనవసరమైన వాటిని కొనుగోలు చేయకూడదు.
4. సదరు క్రెడిట్ కార్డ్‌పై ఉన్న అన్ని బెనిఫిట్స్‌ను ఉపయోగించుకున్న తరవాత, దానిని క్లోజ్ చేసి, మరోదాన్ని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కచ్చితంగా మీకు బోలెడు డబ్బు ఆదా అవుతుంది.
నోట్ : ఈ ఆర్టికల్‌లో చెప్పిన అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.