KTR about MLAs Disqualification Petitions :పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతా పిటిషన్లపై శాసనసభాపతి నిర్ణయం తీసుకోపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. అనర్హతా పిటిషన్ల విషయమై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ తీర్పుపై ఆయన స్పందించారు. మొన్నటి వరకు సభాపతిని ఆదేశించే అధికారం కోర్టుకు లేదని వాదించారని కేటీఆర్ గుర్తు చేశారు. రీజనబుల్ పీరియడ్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సీజే స్పష్టం చేశారని గుర్తుచేశారు. రీజనబుల్ పీరియడ్ అంటే మూడు నెలలు అని మణిపూర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
వంద కోట్ల విరాళం వెనక కుట్ర :అదానీతో ఒప్పందాలు రద్దు చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ చెబుతారా లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. అదానీ బండారం అంతర్జాతీయ స్థాయిలో బయటపడిందని, భారతదేశ ప్రతిష్ఠ అంతర్జాతీయ స్థాయిలో మసకబారిందని అన్నారు. పదేళ్ల కేసీఆర్ హయాంలో ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అదానీకి రాష్ట్రంలో అవకాశం ఇవ్వలేదని, ఆయన కొన్ని ప్రతిపాదనలు తీసుకొస్తే తాము అంగీకరించలేదని తెలిపారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే అదానీతో రూ. 12,400 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నారని, తెలంగాణ విద్యుత్ సంస్థలను అదానీకి అప్పగించే ప్రయత్నం కూడా సీఎం చేశారని కేటీఆర్ ఆరోపించారు. రామన్నపేటలో ప్రజలు అందరూ వ్యతిరేకిస్తున్నా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నారన్న కేటీఆర్, అదానీ మనసు అకస్మాత్తుగా మారి స్కిల్ యూనివర్సిటీకి రూ. 100 కోట్ల భూరి విరాళం ఇచ్చారని అన్నారు. వీటన్నింటి వెనక కుట్ర ఉందని ఆరోపించారు.