KTR Reacted on Kothapally Mid Day Meals Issue : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత లేని భోజనం పెడుతున్నారని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కొత్తపల్లి పాఠశాలలో పిల్లలకు కారం మెతుకులతో భోజనం పెట్టటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ ఉదంతంపై ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందించటంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని మండిపడ్డారు.
నిజామాబాద్ జిల్లా కొత్తపల్లి పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కారం లేని పప్పు వడ్డించారని, పిల్లలు తినేందుకు ఇష్టపడకపోవడంతో వాళ్లకు గొడ్డు కారం, నూనె పోసి భోజనం పెట్టారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు ఇలాంటి ఆహారం అందిస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పిల్లలకు మంచి భోజనం పెట్టకపోగా, కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను కూడా రద్దు చేయడం ఏమిటని అడిగారు. పాఠశాలల్లో విద్యార్థులకు పెడుతున్న భోజనం నాణ్యత విషయంలో సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేటీఆర్ కోరారు.
భావి భారత పౌరుల పట్ల బాధ్యతారహితం : ఇదే అంశంపై ఆదివారం స్పందించిన హరీశ్‌రావు, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించటంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు సరైన ఆహారం లేక ఇబ్బందులు పడ్డారని మంత్రి పేర్కొన్నారు. ఆకలితో ఉన్న విద్యార్థులు కారం, నూనెతో అన్నం కలుపుకుని కడుపు నింపుకోవాల్సి వచ్చిందని మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా విద్యార్థుల ఫొటో పంచుకున్న హరీశ్‌రావు, ప్రభుత్వం భావి భారత పౌరుల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.