KTR Participate in BRS Cadre Meeting at Vikarabad :కాంగ్రెస్ ప్రభుత్వ అబద్ధాలకు, బీఆర్‌ఎస్ పదేళ్ల అభివృద్ధికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి కేటీఆర్‌తో పాటు చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ బీఆర్‌ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గతంలో గెలిపించిన విశ్వేశ్వర్ రెడ్డి విశ్వాసం లేని నాయకుడు, రంజిత్ రెడ్డి కాదు రన్నింగ్ రెడ్డిలు అంటూ ఎద్దేవా చేశారు. యాక్టింగ్‌లో అవార్డు ఇవ్వాల్సి వస్తే మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డిలకే మొదటి బహుమతి ఇవ్వాలన్నారు. ఎందుకంటే పార్టీ మారే సమయంలో ఇద్దరూ పరిగి సభలో మస్తు యాక్టింగ్ చేశారని అన్నారు.
మంత్రి కల నెరవేర్చిన కేసీఆర్(KCR)ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి మహేందర్ రెడ్డి అని కేటీఆర్ ధ్వజమెత్తారు. అన్ని పార్టీల్లో నేడు పోటీ చేస్తున్న వ్యక్తులు మన పార్టీ నుంచి పోయిన వాళ్లేనన్నారు. బీజేపీ వాళ్లు మోదీ హవా అంటున్నారు మరి ఇతర పార్టీల నాయకుల కాళ్లు మొక్కి ఎందుకు తీసుకుపోతున్నారని ప్రశ్నించారు. దేవుడిని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తుంది కమలం పార్టీనే అంటూ ధ్వజమెత్తారు. రాముడికి మొక్కుదాం బీజేపీని తొక్కుదాం అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
BRS Cadre Meeting at Vikarabad :ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు, సైనిక స్కూల్ ఇవ్వలేని పార్టీకి ఓటేయాలా అంటూ కేటీఆర్ దుయ్యబట్టారు. నరేంద్ర మోదీ(PM Modi) ప్రియమైన ప్రధాని కాదు, పిరమైన ప్రధాని అన్ని ధరలు పెంచారని అన్నారు. పార్టీ మారిన రంజిత్ రెడ్డి పార్టీ గురించి ఎంత మాట్లాడితే అంత మంచిదని తెలిపారు. పరిపాలనా తన చేతుల్లో లేదని ఎన్నికల కమిషన్ చేతుల్లో ఉందంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. చేవెళ్లలో ఓడిపోతారని రేవంత్ రెడ్డికి అర్థమయిందని అందుకే ఇంఛార్జి బాధ్యతల నుంచి తప్పుకున్నారని ఆరోపించారు.