KK Meets CM Revanth Reddy Today : లోక్‌సభ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్‌లోకి చేరికల ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు హస్తం కండువా కప్పుకోగా, బీఆర్ఎస్ కీలక నేతలు కె.కేశవరావు, కడియం శ్రీహరి, తమ కుమార్తెలతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ ఎంపీ కె. కేశవరావు సమావేశమయ్యారు.
జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీతో కలిసి రేవంత్‌తో భేటీ అయ్యారు. ఇటీవల దీపాదాస్ మున్షీ కేకే నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. ఆమె ఆహ్వానం పట్ల సుముఖత వ్యక్తం చేసిన ఆయన, గురువారం భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని కేకేకు కేసీఆర్ చెప్పినా, తాను పార్టీ వీడేందుకు సిద్ధమైనట్లుగా కేకే చెప్పినట్లుగా తెలిసింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా నేడు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నట్లుగా చెప్పినట్లుగా సమాచారం. ఒకట్రెండు రోజుల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆధ్వర్యంలో చేరనున్నట్లుగా సమాచారం. చాలా ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కేకే పని చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా పీసీసీగా పని చేసిన అనుభవం, మంత్రిగా చేసిన అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీలో సైతం కేకేకు సముచిత స్థానం లభించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అన్ని అంశాలపై కేకే ఇవాళ మధ్యాహ్నం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
BRS MP KK To Join Congress :ఈ నెల 30న కాంగ్రెస్‌లో చేరనున్నట్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి ఇప్పటికే ప్రకటించారు. అధికార పార్టీలో ఉంటేనే పనులు జరుగుతాయని, అందుకే కాంగ్రెస్‌లో చేరాలనే నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు. విజయలక్ష్మి తండ్రి, సీనియర్ నేత కేకే సైతం కాంగ్రెస్‌లోకి వెళ్లాలనుకుంటున్నట్టు గురువారం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన సీఎంతో భేటీ అయ్యారు. మరోవైపు కేకే కుమారుడు విప్లవ్ కుమార్ మాత్రం, తాను బీఆర్ఎస్లోనే కొనసాగనున్నట్టు చెప్పారు. తన తండ్రి, సోదరి నిర్ణయాలతో తనకు సంబంధం లేదన్నారు.
ఇట్స్ అఫీషియల్ - కాంగ్రెస్‌లోకి కేకే, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి