Kishan Reddy Fires on CM Revanth : కేసీఆర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి కూడా ప్రమాదకారి అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. అధికారం కోసం కేసీఆర్, రేవంత్ రెడ్డి ఎంతకైనా తెగిస్తారని అన్నారు. అబద్ధాలు ఆడడంలో ఇద్దరు నాయకులు ఆరితేరారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను ఇంటి పేరుగా మార్చుకుందని దుయ్యబట్టారు. అబద్ధాలతో కాంగ్రెస్ 70 ఏళ్లుగా రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
సర్జికల్ స్ట్రైక్స్ గురించి వాస్తవాలు అడిగే స్థాయికి కాంగ్రెస్ నాయకులు దిగజారారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. భద్రతా బలగాలపై కాంగ్రెస్ పార్టీకి ఏనాడూ నమ్మకం లేదన్నారు. భద్రతా బలగాలను కాంగ్రెస్ నేతలు అవమానపరిచారని ఎద్దేవా చేశారు. పాక్ వద్ద అణుబాంబులు ఉన్నందున అణిగిమణిగి ఉండాలని కాంగ్రెస్ నేత చెబుతున్నారని, పాకిస్థాన్‌కు అణిగిమణిగి ఉండే అలవాటు కాంగ్రెస్‌కే ఉందని దుయ్యబట్టారు. పాక్ దాడులను భారత్ పూర్తిగా నిలువరించిందని చెప్పారు. పాక్ తోకను పూర్తిగా కత్తిరించి నడ్డివిరిచామని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అసమర్థత వల్ల పాక్‌కు అడ్డుకట్ట వేయలేకపోయారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.