Khammam MP Ticket 2024 :ఖమ్మంలోక్సభ అభ్యర్థి ఎంపిక అధికార కాంగ్రెస్ పార్టీలో కాక పుట్టిస్తోంది. ఎన్నికల బరిలో నిలిచేందుకు జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల కుటుంబీకులు ఢీ అంటే ఢీ అంటుండటంతో అభ్యర్థి ఎంపిక కొలిక్కిరాకపోగా అధికార పక్షంలో రాజకీయ వేడి పుట్టిస్తోంది. హేమాహేమీలు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు ఎవరికి వారే ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టాలన్న లక్ష్యంతో రాజకీయంగా పావులు కదుపుతున్నారు.
మంత్రులు సైతం ఓ వైపు అధికార కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల్లో కలివిడిగా సందడిగా పాల్గొంటూనే లోక్‌సభ ఎన్నికల్లో తమ వారిని అభ్యర్థులుగా నిలబెట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిత్వం కోసం పొంగులేటి ప్రసాద్ రెడ్డి, తుమ్మల యుగంధర్, మల్లు నందిని దరఖాస్తులు చేసుకున్నప్పటి నుంచీ టికెట్ దక్కించుకునేందుకు అవసరమైన ఏ ఒక్క మార్గాన్నీ వదలడం లేదు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తమ కుటుంబీకులను బరిలో నిలిపేలా మంత్రులు సైతం తమవంతు చక్రం తిప్పుతున్నారు. సామాజిక సమీకరణాలు, పార్టీకి విధేయత చూసి తమకంటే తమకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు.
బీజేపీ రెండో జాబితా విడుదల - తెలంగాణ నుంచి ఆరుగురి పేర్లు ఖరారు
Congress Khammam MP Candidate :ఈ ముగ్గురికి తోడు వీవీసీ ట్రస్టు అధినేత వంకాయల పాటి రాజేంద్రప్రసాద్ సైతం టికెట్ దక్కించుకునేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే కాంగ్రెస్(Congress) ముఖ్యనేత డీకే శివకుమార్‌ను కలిసి తనకు అవకాశం కల్పించాలని కోరిన ఆయన పార్టీకి చెందిన ముఖ్యనేతల అండదండలతో దిల్లీలోనూ పార్టీ పెద్దలను కలిసి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక ఖమ్మం నుంచి బరిలో దిగితే పార్టీ గెలుపు నల్లేరుపై నడకే అన్నచందంగా ఉంటుందని భావిస్తున్న వీహెచ్, కుసుమకుమార్ వంటి సీనియర్ నేతలు సైతం ఇక్కడి నుంచే బరిలోకి దిగాలని యోచిస్తున్నారు.
ఇలా పార్టీ టికెట్ దక్కించుకోవడం ఎవరికి వారే ఇటు రాష్ట్ర పార్టీ నాయకత్వం జాతీయ నాయకత్వంపై ఒత్తిడి తీవ్రం చేయడంతో కాంగ్రెస్‌లో అభ్యర్థి ఎంపిక కేంద్ర ఎన్నికల కమిటీకి సైతం కత్తిమీద సాములా మారింది. ఇప్పటికే మూడు సార్లు సమావేశమై చాలా వరకు స్థానాల్లో అభ్యర్థుల(Candidates) ఎంపిక కొలిక్కి తెచ్చినప్పటికీ ఖమ్మం బరిలో నిలిపే గెలుపు గుర్రం ఎంపిక ఇంకా పెండింగ్ లోనే ఉంది.