Khammam Lok Sabha Candidates Election Nomination : ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల్లో నామినేషన్ల సందడి నెలకొంది. ఈ రోజు ఆఖరి తేదీ కావడంతో అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఖమ్మం లోక్‌సభ స్థానంలో మొత్తం 51 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, మహబూబాబాద్ స్థానంలో 25 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నామపత్రాలు దాఖలు చేశారు. రెండు నియోజకవర్గాల్లో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఖమ్మం లోక్‌సభ స్థానంలో బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్-రామసహాయం రఘురామిరెడ్డి, బీజేపీ-తాండ్ర వినోద్‌రావు బరిలో ఉన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ నుంచి మాలోత్ కవిత, కాంగ్రెస్-పోరిక బలరాం నాయక్, బీజేపీ- సీతారాం నాయక్ పోటీలో ఉన్నారు.
Khammam Congress Candidate Election Nomination :సుధీర్ఘ ఉత్కంఠకు తెరదించుతూ, ఖమ్మం లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురామిరెడ్డి నామినేషన్ వేశారు. సుధీర్ఘ మంతనాల తర్వాత బుధవారం రాత్రి ఆయన పేరును అధిష్ఠానం ప్రకటించింది. ఈరోజు ఖమ్మం రిటర్నింగ్ అధికారి వి.పి. గౌతమ్‌కు రెండు సెట్ల నామ పత్రాలు విడివిడిగా అందజేశారు. మొదటి సెట్ ఎంపీ రేణుకా చౌదరి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేను సాంబశివరావులోతో కలిసి వేశారు. రెండో సెట్ మంత్రి పొంగులేటి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌లతో కలిసి నామ పత్రం ఇచ్చారు.
"సోనియా గాంధీ జిల్లా అధ్యక్షులు అందరి నిర్ణయాలను, అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతే వారికి టికెట్ ఇచ్చారు. ఖమ్మం ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే కాంగ్రెస్ పార్టీని అక్కున చేర్చుకుని విజయపథంలో నడిపించారో, లోక్‌సభ ఎన్నికల్లో కూడా అదే తరహాలో కాంగ్రెస్‌ను గెలిపించాలి. రామసహాయం వాళ్ల కుటుంబం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. వారి తండ్రి రాజకీయాల్లో ఉండేవారు. వారు ఇప్పుడు సేవచేయడానికి ఎంపీగా పోటీ చేయాలి అని అనుకుంటున్నారు." - తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి