తెలంగాణ

telangana

ETV Bharat / politics

నేడు బీఆర్ఎస్ కీలక సమావేశం - ఎంపీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేయనున్న కేసీఆర్‌ - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024

KCR Review Meeting on Lok Sabha Elections Today : తెలంగాణ గొంతుక ఎజెండాగా పార్టీకి పూర్వవైభవం ధ్యేయంగా భారత్ రాష్ట్ర సమితి లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రలకు శ్రీకారం చుట్టబోతున్నారు. కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను ఎత్తి చూపడంతో పాటు గులాబీ పార్టీ హయాంలో చేపట్టిన కార్యక్రమాలు వాటి ద్వారా కలిగిన లబ్ధిని ప్రజలకు వివరించేలా ప్రచారం కొనసాగించనున్నారు. అభ్యర్థులు, నేతలతో ఇవాళ సమీక్షించనున్న గులాబీ దళపతి బీ ఫారాలు, ఎన్నికల వ్యయం కోసం చెక్కులను అందించనున్నారు.

brs election campaign 2024
brs election campaign 2024

By ETV Bharat Telangana Team

Published : Apr 18, 2024, 7:29 AM IST

పార్టీకి పూర్వవైభవం ధ్యేయంగా సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమైన బీఆర్ఎస్

KCR Review Meeting on Lok Sabha Elections Today :శాసనసభ ఎన్నికల్లో ఓటమితో అధికారానికి దూరమైన భారత్ రాష్ట్ర సమితికి (BRS Strategy On MP Elections) లోక్‌సభ ఎన్నికలు సంకటంగా మారాయి. పార్టీ అధికారం కోల్పోయిన వెంటనే పలువురు నేతలు పార్టీని వీడారు. సిట్టింగ్ ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇతర పార్టీల్లో చేరారు. 17 స్థానాలకు బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. సిట్టింగులు, గతంలో పోటీ చేసిన వారు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతో పాటు కొత్త వారిని పార్లమెంట్ ఎన్నికల బరిలో దింపుతోంది.

BRS Strategy on Parliament Elections 2024 :కొత్త, పాత మేళవింపుతో సామాజిక సమీకరణాల దృష్ట్యా టికెట్లను ఖరారు చేసింది. 5 ఎస్సీ, ఎస్టీ స్థానాలు పోగా మిగిలిన 12 స్థానాల్లో సగం సీట్లను అంటే 6 లోక్‌సభ స్థానాలను బీసీలకు కేటాయించింది. వారిలో మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి, యాదవులు, కురుమ, గౌడ, ముదిరాజ్ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరికి టికెట్లు ఇచ్చింది. రెండు ఎస్టీ స్థానాల్లో బంజారా, ఆదివాసీలకు ఒక్కో స్థానాన్ని కేటాయించింది. మూడు ఎస్సీ సీట్లలో రెండు మాదిగ సామాజిక వర్గానికి, ఒక స్థానాన్ని మాలలకు కేటాయించింది. మిగిలిన ఆరు జనరల్ సీట్లలో నాలుగు రెడ్లకు, ఒకటి వెలమ, మరొక స్థానాన్ని కమ్మ సామాజిక వర్గానికి కేటాయించింది.

ప్రచారంలో జోరు పెంచిన గులాబీ దళం - 'పార్లమెంట్​లో గళం వినపడాలంటే బీఆర్ఎస్​ను గెలిపించాల్సిందే' - BRS Election Campaign 2024

ముందుగానే ప్రచారాన్ని ప్రారంభించిన బీఆర్ఎస్ : ఎన్నికల నోటిఫికేషన్‌కు చాలా ముందుగానే బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారాన్ని ప్రారంభించారు. అభ్యర్థులతో పాటు మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు క్షేత్రస్థాయిలో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. పార్టీ ముఖ్యనేతలైన కేటీఆర్, హరీశ్‌రావు వివిధ నియోజకవర్గాల్లో పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. రోడ్‌ షోలు, పాదయాత్రల ద్వారా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ (KCR Election Campaign 2024) సైతం ఇప్పటికే మూడు బహిరంగసభ సభల్లో పాల్గొన్నారు. సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ కరీంనగర్ నుంచి ఆయన లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత చేవెళ్లలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు. మెదక్, జహీరాబాద్ నియోజకవర్గాల ఉమ్మడి సభలోనూ పాల్గొన్నారు.

KCR Bus Yatra Across Telangana :ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తరుణంలో ప్రజల్లోకి మరింతగా వెళ్లే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు కేసీఆర్ సిద్ధమయ్యారు. భారీ బహిరంగసభలకు బదులుగా బస్సుయాత్రల ద్వారా వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటించాలన్నది ఆయన ఆలోచన. రోజుకు ఐదు నుంచి ఆరు కార్నర్ మీటింగుల్లో ప్రసంగించేలా బస్సుయాత్రలు, రోడ్ షోలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. శని లేదా ఆదివారం నుంచి కేసీఆర్ బస్సుయాత్రలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంలోని అలంపూర్ నుంచి బస్సుయాత్రను ప్రారంభించి అన్ని నియోజకవర్గాలను చుట్టేసేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు.

BRS Election Campaign in Telangana 2024 : ఇవాళ నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న తరుణంలో లోక్‌సభ ఎన్నికలపై కేసీఆర్ సమీక్ష నిర్వహించున్నారు. సార్వత్రిక ఎన్నికల బరిలో దిగుతున్న అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఇంఛార్జ్‌లు, సీనియర్ నేతలు, జడ్పీ ఛైర్మన్లు, కార్పొరేషన్ మాజీ ఛైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో కేసీఆర్ తెలంగాణ భవన్‌లో సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల వ్యూహం, కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. కేసీఆర్ బస్సుయాత్ర రూట్ మ్యాప్‌పై కూడా సమావేశంలో చర్చించి ఖరారు చేయనున్నారు. ఎంపీ అభ్యర్థులకు బీ ఫారాలతో పాటు ఎన్నికల వ్యయం కోసం రూ.95 లక్షల చెక్కును కూడా కేసీఆర్ ఇవాళ అందించనున్నారు.

పార్టీ నేతలు, శ్రేణులను కలుపుకుని వెళ్లేలా బీఆర్​ఎస్ బిగ్​ ప్లాన్ - నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తల నియామకం - BRS Party Focus On Coordinators

BRS MP Candidates 2024 :కేంద్రంలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైఫల్యాలనే ప్రధాన అస్త్రాలుగా చేసుకొని బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతోంది. ప్రత్యేకించి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హస్తం పార్టీ ఇచ్చిన గ్యారంటీలు వాటి అమలు తీరును ప్రజలకు గులాబీ నేతలు వివరిస్తున్నారు. శాసనసభ ఎన్నికలకు ముందు హామీలకు సంబంధించి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియోలను సమావేశాల్లో ప్రదర్శిస్తున్నారు.

ప్రశ్నించే గొంతుకగా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి : హామీల నుంచి లబ్ధి పొందిన వారు హస్తం పార్టీకి, లబ్ధి పొందని వారు బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని గులాబీ నేతలు కోరుతున్నారు. భారత్ రాష్ట్ర సమితి పాలనతో పోలుస్తూ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న నీటి ఎద్దడి, పంటల నష్టం, తదితరాల ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ ప్రయోజనాలు, హక్కుల కోసం పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్‌ మాత్రమేనని, ప్రశ్నించే గొంతుకగా తమ అభ్యర్థులను గెలిపించాలని వారు ప్రజలను కోరుతున్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్​ఎస్​ కసరత్తులు - ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారాలు షురూ - Lok Sabha Elections 2024

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా లేదు: కేసీఆర్‌ - BRS Lok Sabha Election Campaign

ABOUT THE AUTHOR

...view details