తెలంగాణ

telangana

ETV Bharat / politics

'అనతికాలంలోనే ఆదర్శ పాలన అందించాం - రాష్ట్ర ప్రజల నిర్ణయం ఇతర రాష్ట్రాల రైతాంగాన్ని నిరుత్సాహపరిచింది' - KCR Meeting with Party Leaders

KCR Comments with Party Leaders : తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే దేశానికి ఆదర్శంగా పాలన అందించిందని, విద్యుత్, సాగు, తాగు నీరు, వ్యవసాయం తదితర రంగాల్లో బీఆర్​ఎస్​ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యాచరణ దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా కొనసాగిందని పేర్కొన్నారు. తెలంగాణ వ్యవసాయ ప్రగతిని చూసి మహారాష్ట్ర వంటి పక్క రాష్ట్రాల ప్రజలు తమకూ కేసీఆర్ పాలన కావాలని కోరుకున్నారని, కేసీఆర్ పాలన లేకపోవడం వల్ల తెలంగాణ రైతుల కంటే మహారాష్ట్రతో పాటు దేశ రైతాంగమే తీవ్రంగా నష్టపోయిందని ఇటీవల తనను కలిసిన మహారాష్ట్ర నేతలు అన్నారని బీఆర్​ఎస్ అధినేత పేర్కొన్నారు. తనను కలిసేందుకు వచ్చిన పలువురు పార్టీ నేతలతో ఈ మేరకు కేసీఆర్ వ్యాఖ్యానించారు.

KCR
KCR Comments with Party Leaders (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 4, 2024, 8:30 PM IST

KCR Meeting with Party Leaders :'అబ్ కీ బార్ - కిసాన్ సర్కార్' అన్న నినాదంతో దేశంలో రైతురాజ్యం తెచ్చుకోవాలని బీఆర్​ఎస్​తో కలిసి అడుగులేస్తూ ముందుకు కదిలిన మహారాష్ట్ర తదితర రాష్ట్రాల ప్రజలు మొన్నటి తెలంగాణ ఎన్నికల ఫలితాలతో తీవ్ర ఆవేదన చెందారని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఖమ్మం, మహబూబాబాద్, వేములవాడ, నర్సాపూర్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల నుంచి తనను కలిసేందుకు వచ్చిన వారితో సమావేశమైన ఆయన, వారినుద్దేశించి ప్రసంగించారు.

తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే దేశానికి ఆదర్శంగా పాలన అందించిందని, విద్యుత్, సాగు, తాగునీరు, వ్యవసాయం తదితర రంగాల్లో బీఆర్​ఎస్​ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యాచరణ దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా కొనసాగిందని పేర్కొన్నారు. తెలంగాణ వ్యవసాయ ప్రగతిని చూసి మహారాష్ట్ర వంటి పక్క రాష్ట్రాల ప్రజలు తమకూ కేసీఆర్ పాలన కావాలని కోరుకున్నారని తెలిపారు.

కేసీఆర్ పాలన లేకపోవడం వల్ల తెలంగాణ రైతుల కంటే మహారాష్ట్రతో పాటు దేశ రైతాంగమే తీవ్రంగా నష్టపోయిందని ఇటీవల తనను కలిసిన అక్కడి నేతలు అన్నారని బీఆర్​ఎస్ అధినేత వివరించారు. రాష్ట్రంలో బీఆర్​ఎస్ ఓటమితో రైతు రాజ్యాన్ని అందించగల దమ్మున్న కేసీఆర్ దార్శనిక నాయకత్వాన్ని దేశం కోల్పోయిందని వారు బాధపడ్డారని తెలిపారు. నల్ల చట్టాలను తెచ్చిన బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిల్లీ వీధుల్లో దేశ రైతాంగం శాంతియుత పోరాటం చేసిందని, రైతుల మీద లాఠీఛార్జ్, కాల్పులు జరిపి 700 మంది రైతుల మరణానికి నాటి సర్కార్ కారణమైందని కేసీఆర్ మండిపడ్డారు.

లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో బీఆర్​ఎస్​కు దిష్టి తీసినట్లైంది - నేటి పరిస్థితులు ఒక లెక్కే కాదు : కేసీఆర్​ - KCR Meet BRS Activists at Erravalli

అభివృద్ధి కోసం కొనసాగే నిరంతర ప్రక్రియే రాజకీయం : దేశ రైతాంగ బాధలను తీర్చేందుకు నడుం కట్టిన బీఆర్​ఎస్ పార్టీ, కిసాన్ సర్కార్ నినాదంతో మహారాష్ట్ర నుంచి ఒక లైన్ తీసుకొని ముందుకు సాగిందని వివరించారు. మహారాష్ట్ర ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చిందని, దేశ రైతాంగ ప్రగతి కోసం బయలుదేరిన నేపథ్యంలో తెలంగాణ ప్రజల నిర్ణయం ఇతర రాష్ట్రాల రైతాంగాన్ని నిరుత్సాహపరిచిందని కేసీఆర్ తెలిపారు.

ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదని, ప్రతిపక్ష పాత్ర కూడా శాశ్వతం కాదని, ప్రజలు ఎలాంటి పాత్ర అప్పగిస్తే దానిని చిత్తశుద్ధితో నిర్వర్తించాలని అన్నారు. అధికారం కోల్పోయామని బాధపడటం సరైన రాజకీయ నాయకుడి లక్షణం కాదని వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం కొనసాగే నిరంతర ప్రక్రియే రాజకీయం అని, దానికి గెలుపు, ఓటములతో సంబంధం ఉండదని కేసీఆర్ అన్నారు. ప్రజల్లో కలిసి ఉంటూ వారి సమస్యలపై నిరంతరం పోరాడుతూ వారి అభిమానాన్ని సాధించాలని పునరుద్ఘాటించారు.

కేసీఆర్ పాలన పోతదనుకోలేదు : గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం కొనసాగించిన సాగు, తాగు నీరు, నిరంతర విద్యుత్, ఫీజు రీయింబర్స్​మెంట్, సీఎంఆర్ఎఫ్ వంటి అనేక పథకాలను కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించకపోవడంతో తెలంగాణ సమాజం తీవ్రంగా నష్టపోతోందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయేది బీఆర్​ఎస్​ ప్రభుత్వమే అన్న ఆయన, తెలంగాణ సంపూర్ణ అభివృద్ధి సాధించడమే పార్టీ అంతిమ లక్ష్యమని స్పష్టం చేశారు.

కార్యకర్తలు ఏమాత్రం అధైర్యపడొద్దని, గెలుపోటములకు అతీతంగా నిరంతర కృషి కొనసాగించడమే కర్తవ్యమని పిలుపునిచ్చారు. అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని తెలంగాణను సకలం బాగు చేస్తున్న కేసీఆర్ పాలన పోతదనుకోలేదని, జరిగిన పొరపాటుకు తెలంగాణ సమాజం బాధపడుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తూ అధినేత కేసీఆర్​ను కలవడానికి పలు ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు అభిప్రాయపడ్డారు.

ఏడు నెలల పాలనకే కాంగ్రెస్​ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత : కేసీఆర్​

ముందస్తు సమాచారం లేకుండా రావొద్దు : కేసీఆర్ ప్రభుత్వాన్ని పోగొట్టుకుని ఊళ్లలో బాధపడుతున్నారని కేసీఆర్​తో కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని నినాదాలతో మద్దతు ప్రకటించారు. తనను కలిసేందుకు ముందస్తు సమాచారం లేకుండా రావొద్దని నేతలు, కార్యకర్తలను బీఆర్​ఎస్​ అధినేత మరోమారు కోరారు. అలా వస్తే అందరికీ ఇబ్బందే అన్న ఆయన, ముందస్తు సమాచారం, అనుమతి తీసుకొని రావాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ ముందుగా ప్రకటించే నియోజకవర్గాల వారే రావాలని, చెప్పినా వినకుండా వచ్చి ఇబ్బందులు పడొద్దని మరోమారు స్పష్టం చేశారు.

ఒకరు పోతే పది మంది నాయకులను తయారు చేసుకుంటాం : కేసీఆర్​ - Ex CM KCR meets BRS MLAs

ABOUT THE AUTHOR

...view details