Bajrang Punia Suspended : స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా తాజాగా నిషేధానికి గురయ్యారు. యాంటీ డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు నాడా ఆయనపై నాలుగేళ్ల నిషేధం విధించింది. మార్చి 10న జాతీయ జట్టుకు ఎంపిక ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్ట్ కోసం నమూనా ఇవ్వడానికి అతడు నిరాకరించడం వల్ల ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఆ పార్టిలో చేరితే నిషేధం ఎత్తివేస్తారు : పునియా
మరోవైపు ఈ విషయంపై తాజాగా పునియా స్పందించారు. బీజేపీలో చేరితే తనపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తారని వ్యాఖ్యలు చేశారు."ఇదేమీ నాకు షాకింగ్‌గా అనిపించలేదు. గత ఏడాది నుంచే ఈ అంశం తెగ నలుగుతోంది. నాడాకు నమూనాలు ఇచ్చేందుకు నేను నిరాకరించలేదని గతంలోనే వెల్లడించాను. అయితే వారు డోప్ టెస్ట్ చేసేందుకు మా ఇంటికి వచ్చినప్పుడు, అధికారులు ఎక్స్పైరీ అయిన కిట్‌ను తీసుకొని వచ్చారు. దానికి గురించి నేను సోషల్ మీడియాలోనూ మాట్లాడాను. మహిళా రెజ్లర్లకు సపోర్ట్‌గా పోరాటాల్లో పాల్గొన్నందుకు వారు మాపై రివేంజ్ తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నేను గత 10 నుంచి 12 ఏళ్లుగా ఈ రెజ్లింగ్‌లో పోటీపడుతున్నాను. టోర్నమెంట్‌లలో భాగంగా శాంపిల్స్ ఇచ్చాను. మమ్మల్ని విడదీసి, వారి ముందు తలవంచేలా చేయాలన్నదే వారి ఉద్దేశంలా కనిపిస్తోంది. నేను ఆ పార్టిలో చేరితే ఈ నిషేధాలన్నీంటినీ ఎత్తివేస్తారని అనుకుంటున్నాను" అని బజరంగ్ ఆరోపించారు.
చర్యలు ఎలా ఉన్నాయంటే :
ఏప్రిల్ 23నే బజ్‌రంగ్ ప్రొవిజనల్ సస్పెన్షన్‌కు గురయ్యారు. అయితే తాజా చర్యలతో 2028 ఏప్రిల్ 22 వరకు ఆయనపై నిషేధం ఉంటుందని నాడా పేర్కొంది. దీంతో రెజ్లింగ్‌లో పోటీపడేందుకు, విదేశాల్లో ఏదైనా కోచింగ్ విధులు నిర్వర్తించేందుకు ఆయన దరఖాస్తు చేసుకోవడానికి వీలు ఉండనట్లు తెలుస్తోంది.
అయితే బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని దేశంలోని ప్రముఖ మహిళా రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద గతేడాది పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇక బజరంగ్‌తో పాటు మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫొగాట్‌లతో కలిసి ఈ నిరసనల్లో కీలక పాత్ర పోషించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.