Telangana HC Serious about Food Poison in School : మధ్యాహ్నం భోజనం వికటించిన పాఠశాలలో నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నివేదిక వచ్చాక అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకోవాలంది. మాగనూరు పాఠశాలలో వారం వ్యవధిలో మూడుసార్లు భోజనం వికటించడానికి గల కారణాలపై పూర్తి స్థాయి నివేదికను సోమవారం సమర్పించాలని విచారణను వాయిదా వేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్ రావులతో కూడిన ధర్మాసనం విచారణ నిర్వహించింది.
పిటిషనర్ గురుతేజ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. మాగనూరు జడ్పీ పాఠశాలలో వారం రోజుల వ్యవధిలో మూడుసార్లు భోజనం వికటించి పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని కోర్టుకు తెలిపారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు వడ్డించకపోవడం వల్లే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆయన వాదించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల వ్యవధిలో మూడుసార్లు భోజనం వికటించి విద్యార్థులు ఆస్పత్రి పాలవడమేమిటని, ఇలా జరుగుతుంటే సంబంధిత అధికారులు నిద్రపోతున్నారా అని హైకోర్టు ప్రశ్నించింది.
మానవత్వంతో వ్యవహరించాలి : అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనడానికి ఇది నిదర్శనమని, ఈ విషయంలో ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకోవడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అధికారులకూ పిల్లలున్నారు కదా అని, మానవత్వంతో వ్యవహరించాలని తెలిపింది. దీనిపై వివరాలు సమర్పించడానికి వారం రోజుల సమయం కావాలని పీపీ కోరడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా కేంద్రంలో ఉన్న అధికారిని సంప్రదించడానికి వారం రోజుల వ్యవధి ఎందుకని ప్రశ్నించింది. సదరు అధికారి వద్ద ఫోన్ లేదా ఇంటర్‌నెట్ సౌకర్యం లేదా లేకపోతే సదరు అధికారి మైనస్ 30 డిగ్రీల వాతావరణంలో ఉన్నారా అని లేదా అక్కడికి వెళ్లలేని పరిస్థితి ఉందా అని అసహనం వ్యక్తం చేసింది. చిన్నారుల పట్ల ఈ విధంగానే వ్యవహరిస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది.
చిరుతిళ్లు తిని అస్వస్థతకు గురయ్యారు : పిల్లలు చనిపోతే కానీ స్పందించరా అని హైకోర్టు పేర్కొంది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే 5 నిమిషాల్లో హాజరవుతారని, వివరణ ఇవ్వడానికి వారం రోజుల వ్యవధి ఎందుకని ప్రశ్నించింది. అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ విచారణ మధ్యలో హాజరై ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించి భోజన విరామం తర్వాత సమర్పిస్తామని హైకోర్టు తెలిపారు. భోజన విరామం తర్వాత కొనసాగిన వాదనల సందర్భంగా ఏఏజీ వాదించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులు బయటి నుంచి చిరుతిళ్లు తిన్నారని కోర్టుకు తెలిపారు. కడుపునొప్పితో బాధపడిన చిన్నారులను వెంటనే ఆస్పత్రికి తరలించామన్నారు. పూర్తిస్థాయి నివేదికను సోమవారం సమర్పిస్తామని ఏఏజీ కోర్టుకు తెలిపారు.
మాగనూరు జడ్పీ పాఠశాలకు ఏమైంది? - మరోసారి వికటించిన మధ్యాహ్న భోజనం - ఈసారి 40 మందికి పైగా అస్వస్థత