తెలంగాణ

telangana

ETV Bharat / politics

'మొన్న రేవంత్‌ అలా - నేడు భట్టి ఇలా - రుణమాఫీపై ఎవరి మాటలు నమ్మాలో మీరే చెప్పండి' - Harish Rao Fires on Congress

Harish Rao Today Tweet on Runamafi : రుణమాఫీపై కాంగ్రెస్ నేతలు రోజుకో తీరుగా మాట్లాడుతున్నారని, ఎవరి మాటలు నమ్మాలో ముఖ్యమంత్రి చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రుణమాఫీ కాక రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తుంటే, సీఎం, మంత్రులు ఇష్టానుసారం మాట్లాడి గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. రుణమాఫీ జరిగి ఉంటే రైతులు ఆందోళన ఎందుకు చేస్తారని ప్రశ్నించిన ఆయన, రుణమాఫీపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Harish Rao
Harish Rao Today Tweet on Runamafi (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 20, 2024, 3:30 PM IST

Harish Rao Tweet on Runamafi : రుణమాఫీ పూర్తి కాలేదన్న వాస్తవాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఒప్పుకుని రైతులకు క్షమాపణ చెప్పాలని, వెంటనే రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ నాయకులు తలాతోక లేకుండా రోజుకో తీరుగా మాట్లాడటం సిగ్గుచేటని ఎక్స్ వేదికగా ఆయన మండిపడ్డారు. రుణమాఫీ విషయమై సీఎం, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఆయన పొందుపరిచారు. ముఖ్యమంత్రి రుణమాఫీ పూర్తి చేసినట్లు డబ్బా కొడితే, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం రుణమాఫీ పూర్తి కాలేదని అంటున్నారని పేర్కొన్నారు.

మొన్న ఖమ్మం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి రూ.18 వేల కోట్లతో రుణమాఫీ పూర్తిగా చేసినట్లు ప్రకటిస్తే, ఇందుకు భిన్నంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రుణమాఫీ పూర్తిగా జరగలేదని, ఇంకా రూ.12 వేల కోట్లు కూడా విడుదల చేస్తామని చెప్పినట్లు గుర్తు చేశారు. మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా 17 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదంటున్నారని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రూ.31 వేల కోట్ల రుణమాఫీ పూర్తి చేసినట్లు రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే పచ్చి అబద్ధం చెప్పారని హరీశ్‌ రావు ఆక్షేపించారు. ఏది నిజం, ఇందులో ఎవరి మాటలు నమ్మాలో ముఖ్యమంత్రి చెప్పాలని కోరారు.

'రుణమాఫీ సంపూర్ణంగా కాలేదని మీరే చెబుతున్నారు - ఇప్పుడు రాజీనామా చేయాల్సిందెవరు?'

ఇప్పటికైనా మాట నిలబెట్టుకోవాలి : ఒకవైపు రుణమాఫీ కాక రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తుంటే, భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడి మరింత గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీ జరిగి ఉంటే బ్యాంకులు, వ్యవసాయ కార్యాలయాలు, కలెక్టరేట్ల చుట్టూ రైతులు ఎందుకు చెప్పులరిగేలా తిరుగుతున్నారని, రైతులు ఎందుకు రోడ్లెక్కి రుణమాఫీ కాలేదనే ఆవేదనతో ఆందోళనలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఆగస్టు 15 వరకు రైతులందరినీ రుణ విముక్తులుగా చేస్తానన్న హామీని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నిలబెట్టుకోవాలని బీఆర్‌ఎస్‌ పక్షాన హరీశ్‌ రావు డిమాండ్ చేశారు.

ఎప్పటిలోగా పూర్తి చేస్తారో స్పష్టత ఇవ్వండి : రుణమాఫీ మొత్తం చేయలేదని మంత్రులే స్పష్టంగా చెబుతున్నారని, ఇప్పుడు ముక్కు నేలకు రాస్తారా? రాజీనామా చేస్తారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని మరో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. 17 లక్షలకు పైగా రైతులకు రుణమాఫీ చేయలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారని, అందుకు భిన్నంగా మొత్తం చేశామని చెప్పడం సిగ్గుచేటని ఆక్షేపించారు. పూర్తయిందని ముఖ్యమంత్రి డ్యాన్స్ చేస్తున్నారని, మంత్రులు తలో మాట మాట్లాడుతుంటే రైతులు ఆందోళనలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రైతాంగాన్ని మోసం చేసినందుకు సీఎం క్షమాపణ చెప్పాలని, చెంపలు వేసుకోవాలన్న జగదీశ్‌ రెడ్డి, మిగిలిన రుణమాఫీ ఎప్పటిలోగా పూర్తి చేస్తారో స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

'రుణమాఫీ హామీపై రేవంత్ మాట తప్పారు - రాజీనామా ఎవరు చేయాలో త్వరలోనే తెలుస్తుంది' - Harish Rao Tweet on cm Revanth

ABOUT THE AUTHOR

...view details