Harish Rao Participate BRS Meeting at Kamareddy : కామారెడ్డి ఎన్నికల్లో ఓటమి గతం గతః - రాబోయే ఎన్నికల్లో విజయం సాధిద్దామని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. ఉద్యమకారుడు గాలి అనిల్ కుమార్‌ను గెలిపించుకుని ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు (Six Guarantees) అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆరోపించారు. ఈ క్రమంలోనే పార్లమెంటు ఎన్నికల్లో (Lok Sabha Election 2024) కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. కామారెడ్డిలో జరిగిన బీఆర్‌ఎస్ పార్టీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ డిసెంబరు 9న రూ.2 లక్షల రుణమాఫీ (Loan Waiver) చేస్తామని మాటిచ్చారు కానీ ఆ హామీ ఏం అయిందని ప్రశ్నించారు. అలాగే వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి, వర్షాకాలంలో ఇవ్వలేదు, పోనీ యాసంగికి అయినా ఇచ్చారా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. రూ.500 బోనస్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటు, లేకుంటే కారు గుర్తుకే ఓటేస్తామని గ్రామాల్లో తీర్మానం చేయించండని కార్యకర్తలకు సూచించారు.
మూడు విచారణలు, ఆరు వేధింపులుగా కాంగ్రెస్ వంద రోజుల పాలన : హరీశ్‌రావు
Harishrao Fires on Congress : కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడంలో ఉన్న ప్రేమ, రైతులపై ఎందుకు లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. మైనార్టీలను కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు మోసం చేస్తున్నాయని విమర్శించారు. తమ పార్టీ నాయకులను కొనొచ్చు కానీ బీఆర్‌ఎస్ కార్యకర్తలను, తెలంగాణ ఉద్యమకారులను కొనలేరని ధ్వజమెత్తారు.