Harish Rao Fires on BJP, Congress : కాంగ్రెస్ మాటలు నీటిమూటలేనని తప్పుడు వాగ్దానాలతో ప్రజలను హస్తం మోసగిస్తోందని మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. అమలుకు సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి(Congress Govt) వచ్చిందన్న ఆయన, గద్దెనెక్కిన తర్వాత ఆడబిడ్డలను మరిచిందని వ్యాఖ్యానించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండ భూదేవి గార్డెన్లో మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ కార్యకర్తలు నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో హరీశ్‌రావు పాల్గొని, అధికార, విపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కాంగ్రెస్ ఎక్కడైనా ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం అధికారంలో ఉండదు : హరీశ్ రావు - Lok Sabha Elections 2024
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడానికి కాంగ్రెస్ కొన్ని చోట్ల డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని హరీశ్‌రావు ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నా రేవంత్ రెడ్డి గులాబీ పార్టీపై(BRS Party) అక్కసు వెళ్లగక్కుడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. హస్తం పార్టీ అధికార పీఠమెక్కి నాలుగు నెలలు కాకముందే, ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని పేర్కొన్నారు. కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఓటు వేస్తే, పెనం మీద నుంచి పొయ్యిలో పడతామని తెలిపారు.
బీజేపీ బడేమియా -కాంగ్రెస్ చోటేమియా : అబద్దాలు చెప్పడంలో బీజేపీ బడేమియా అయితే, కాంగ్రెస్ చోటేమియా అని, ఆ రెండు పార్టీలు అబద్దాల్లో పోటీ పడుతున్నాయన్నారు. గులాబీ పార్టీ లేకుండా చేయాలని బడే బాయ్ చోటే బాయ్ ఒక్కటయ్యారన్నారు. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దగ్గర సరుకు లేదు, పని లేదు అందుకే లీకులు ఫేకు వార్తలు కాలం గడుపుతున్నాయని విమర్శించారు. ఆనాడు చంద్రబాబు కోట్లు గుమ్మరించి తెలంగాణను వ్యతిరేకించినా, గులాబీ జెండానే గెలిచిందన్నారు. కాంగ్రెస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని, రాష్ట్ర అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని ఉద్ఘాటించారు.