Harish Rao Comments on Revanth Reddy about Mission Bhagiratha : సాగునీరు, తాగునీరు ఇవ్వడానికి కూడా లాభనష్టాలతో బేరీజు వేసుకునే ప్రభుత్వం వస్తుందని తెలంగాణ ప్రజలు కలలో కూడా ఊహించి ఉండరని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆక్షేపించారు. ప్రభుత్వమంటే స్థిరాస్తి వ్యాపారం కాదన్న ఆయన, ప్రజా సంక్షేమంలో లాభనష్టాలు చూసుకోరని వ్యాఖ్యానించారు. ప్రజల ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కోసం పెట్టే ఖర్చులో కూడా లాభం తీయాలనుకునేవారు వ్యాపారులు అవుతారు తప్ప పాలకులు కారని అన్నారు. మిషన్ భగీరథ(Mission Bhagiratha)లో లాభం వెతికే ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరమన్న హరీశ్ రావు, ప్రభుత్వానికి లాభం తెచ్చే పని కాదని, అందువల్ల దండగ అని రేవంత్ రెడ్డి మాట్లాడడం అత్యంత శోచనీయమని ఆయన మండిపడ్డారు.
మిషన్ భగీరథ ద్వారా ఏం లాభం తెచ్చారని, దానికి తెచ్చిన అప్పుకు వడ్డీ ఎలా కడతారని ప్రశ్నించడం కంటే దౌర్భాగ్య, భావ దారిద్య్ర ఆరోపణ ఇంకోటి ఉండదని హరీశ్ రావు(Harish Rao) అన్నారు. అసలు మిషన్ భగీరథ ఎందుకు తేవాల్సి వచ్చింది? దాని లక్ష్యం ఏమిటన్న విషయాలపై కనీస అవగాహన కూడా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి లేకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం వందకు వందశాతం నల్లాల ద్వారా మంచినీరు ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిందని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ సాక్షిగా వెల్లడించిందన్న హరీశ్ రావు, మిషన్ భగీరథ పథకాన్ని ప్రజల ఆరోగ్యం కాపాడిన గొప్ప సంజీవనిగా చూడాలి తప్ప, అందులో లాభనష్టాలు బేరీజు వేసుకోవడం ప్రభుత్వాధినేతకు తగదని సలహా ఇచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టారు కానీ, ఫలితం లేదన్న విమర్శలపై అసెంబ్లీలో సాక్ష్యాలు, ఆధారాలతో స్పష్టంగా వివరించినప్పటికీ విమర్శలు చేయడం తగదని హరీశ్ రావు ఆక్షేపించారు. 2014తో పోలిస్తే 2023 చివరికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో పెరిగిన ఆయకట్టును లెక్కలతో సహా చెబితే అది చెవికెక్కదన్న ఆయన, ఎస్సారెస్పీ ద్వారా కోదాడ, డోర్నకల్ వరకు నీరు ఇచ్చామంటే కాళేశ్వరం వల్లే అన్న విషయం అర్థం కాదని మండిపడ్డారు. 1956 నుంచి 2014 వరకు ఉన్న ప్రభుత్వాలు మొత్తంగా 41 లక్షల కొత్త ఆయకట్టుకు మాత్రమే నీరు అందిస్తే, గడిచిన తొమ్మిదిన్నరేళ్లలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం 48 లక్షల ఎకరాలకు నీళ్లు అందించిందని లెక్కలు, ఆధారాలతో సహా చెప్పినా వీరికి అవగాహన కలగడం లేదని అన్నారు.