తెలంగాణ

telangana

ETV Bharat / politics

'సీఎంగా మీకు మోకా వస్తే, డీఎస్సీ అభ్యర్థులకు ఇంత ధోకా చేస్తారా' - రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ - KTR Fires on CM Revanth Reddy - KTR FIRES ON CM REVANTH REDDY

KTR on DSC Candidates Protest : కాంగ్రెస్‌ పార్టీకి ఫిరాయింపుల మీద ఉన్న దృష్టి, పోరుబాట పట్టిన నిరుద్యోగులపై లేకపోవడం సిగ్గుచేటని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే నిరుద్యోగులతో కలిసి మరో ఉద్యమాన్ని నిర్మిస్తామని హెచ్చరించారు.

KTR
KTR on DSC Candidates Protest (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 9, 2024, 5:30 PM IST

KTR Fires on CM Revanth Reddy : డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్‌ జెండా వారికి అండగా ఉంటుందని, లేకపోతే ఈ గుడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు నిరుద్యోగులతో కలిసి మరో ఉద్యమాన్ని నిర్మిస్తామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎక్స్ వేదికగా ఆయన ప్రశ్నలు సంధించారు. తొలి కేబినెట్‌లోనే 25 వేలతో మెగా డీఎస్సీ అని మీరిచ్చిన మాట ఏమైందని, తొమ్మిది నెలలు కావొస్తున్నా లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్థుల ఆక్రందన మీ కాంగ్రెస్ సర్కారుకు వినపడటం లేదా అని ప్రశ్నించారు.

మీరు కొలువుదీరితే సరిపోతుందా? యువతకు కొలువులు అక్కర్లేదా అని రేవంత్ రెడ్డిని అడిగారు. ఉస్మానియా విద్యార్థులు అడ్డమీద కూలీల్లాంటి వారని ఎగతాళి చేశారని, తిన్నది అరిగే దాకా అరిచే బీరు, బిర్యానీ బ్యాచ్ అని బద్నాం చేశారని, సిద్ధాంతం, ఆలోచన లేని ఆవారా టీమ్ అని అవహేళన చేశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక నేడు అదే ఓయూను రణరంగంగా మార్చారన్న కేటీఆర్, డీఎస్సీ అభ్యర్థులపై పోలీసులను ప్రయోగించి అణచి వేస్తున్నారని, వందల మందిని అన్యాయంగా అరెస్టు చేసి అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కనీసం శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్నారని ఆక్షేపించారు.

ఎందుకీ మొండివైఖరి : ఉస్మానియా విశ్వవిద్యాలయం దేశ సరిహద్దుల్లో లేదన్న ఆయన, ఇన్ని బలగాలు, ఎందుకు ఇంతటి నిర్బంధం, మళ్లీ ఉద్యమం నాటి పరిస్థితులను ఎందుకు కల్పిస్తున్నారని ప్రశ్నించారు. నిత్యం పోలీసుల బూట్ల చప్పుళ్లతో ఎందుకు కలవరపెడుతున్నారని, కాంగ్రెస్ చేతకానితనాన్ని ప్రశ్నించడమే వాళ్లు చేసిన నేరమా? ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడగడమే పాపమా అని అడిగారు. ముఖ్యమంత్రిగా మీకు మోకా వస్తే, డీఎస్సీ అభ్యర్థులకు ఇంత ధోకా చేస్తారా అని మండిపడ్డారు. ఇప్పటికే మెగా డీఎస్సీ అని నిరుద్యోగ యువతను నిలువునా మోసం చేశారని దుయ్యబట్టారు. ఇప్పుడు ప్రిపరేషన్‌కు కూడా టైమ్ ఇవ్వకుండా, వారి భవిష్యత్తుతో ఈ చెలగాట మేమిటన్న కేటీఆర్, పరీక్షలు వాయిదా వేయాలని డీఎస్సీ అభ్యర్థులు కోరుతున్నా ఎందుకీ మొండివైఖరి అని ప్రశ్నించారు.

ఆరు గ్యారంటీల హామీ ఇచ్చారు - మా ఆరుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తీసుకెళ్లారు : కేటీఆర్ - KTR SLAMS CONGRESS OVER DEFECTION

పేగులు తెగే దాకా కొట్లాడినా కనికరం లేదు : న్యాయమైన డిమాండ్లను ఆడబిడ్డలు అడిగినంత మాత్రాన అర్ధరాత్రి వరకు అక్రమంగా నిర్బంధిస్తారా అని కేటీఆర్ అడిగారు. ఇదేనా మహిళలంటే ముఖ్యమంత్రికి ఉన్న గౌరవం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే నోటిఫికేషన్లు, అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇస్తామని చెప్పి, ఇప్పుడు కనీసం సీఎం అపాయింట్‌మెంట్ కూడా నిరుద్యోగులకు ఎందుకు ఇవ్వడం లేదని కేటీఆర్ ఆక్షేపించారు. ప్రచారంలో యువతను మభ్యపెట్టి, పీఠమెక్కగానే వారి భవిష్యత్తును బలిపెడతారా అని ప్రశ్నించారు. నిరాహార దీక్షలు చేసినా స్పందన లేదన్న కేటీఆర్, పేగులు తెగే దాకా కొట్లాడినా కనికరం లేదని మండిపడ్డారు.

డీఎస్సీ అభ్యర్థుల గోస తీర్చాలి : ఈ క్రమంలోనే పార్టీ ఫిరాయింపుల మీద ఉన్న దృష్టి, పోరుబాట పట్టిన నిరుద్యోగులపై లేకపోవడం కాంగ్రెస్ సర్కారుకు సిగ్గుచేటని మండిపడ్డారు. ఇన్నాళ్లూ అసమర్థ కాంగ్రెస్‌ను భుజాలపై మోసిన సోకాల్డ్ మేధావులు, ఇప్పుడు ఎక్కడున్నారు? ప్రశ్నించే గొంతులు ఎందుకు మూగబోయాయని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటికైనా డీఎస్సీ అభ్యర్థుల గోస తీర్చాలని, పరీక్షలు వాయిదా, పోస్టుల పెంపు డిమాండ్లు నెరవేర్చాలని కోరారు.

ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోమంటే ఇంత నిర్బంధమా ? : కేటీఆర్ - KTR Fires on Congress Assurances

ABOUT THE AUTHOR

...view details