KTR about Demolitions in Hyderabad :హైదరాబాద్‌లో లక్షలాది మందికి నిద్రలేకుండా చేశారని, ఎప్పుడు ఇళ్లు కూల్చుతారో అని ప్రజలు ఆవేదనలో ఉన్నారని మాజీమంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు ఓట్లు వేసిన వారిపై సీఎం పగపట్టారని విమర్శించారు. మూసీమే లూఠో దిల్లీ మే బాంటో అనేది కాంగ్రెస్ నినాదమని పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో సగం డబ్బులతో మూసీ ప్రక్షాళన చేపట్టారని తెలిపారు. మూసీ పరివాహక ప్రాంత వాసులను అడవిలోకి పంపుతున్నారని మండిపడ్డారు. ఇళ్ల వద్దకు బుల్డోజర్ వస్తే కంచె అడ్డుపెట్టాలని సూచించారు. ఇవాళ హైదరాబాద్ అంబర్‌పేట నియోజకవర్గంలో మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించి, బాధిత కుటుంబాలను పరామర్శించారు.
2020 నాటికి తామే మూసీ ప్రక్షాళన చేద్దామని అనుకున్నామని కేటీఆర్ తెలిపారు. కానీ పేదల ఇళ్లు కూల్చాల్సి వస్తుందని దానికి సంబంధించి ప్రాజెక్టులను బీఆర్ఎస్ పాలనలో నిలిపివేశామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు కడతామంటూ కూల్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లు కూల్చుతుంటే స్థానిక ఎంపీ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి ఇద్దరూ కూడపలుక్కున్నారా? అని వ్యాఖ్యానించారు. పేదలకు కష్టం వస్తే అండగా ఉండేవాడే దేవుడని హితవు పలికారు. ఇల్లు కూల్చేస్తే దాని విలువకు 3 రెట్లు నగదు, ఒక ఉద్యోగం, తరలింపునకు రూ. 5 లక్షలు ఇవ్వాలని గతంలో కాంగ్రెస్సే చట్టం చేసిందని గుర్తుచేశారు.
'మీరు గెలిపించిన ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారు? ఎంపీ కిషన్ రెడ్డి ఎక్కడ ? పండుగ వేళ పేదలకు నిద్ర లేకుండా చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. మూసీ పరివాహక ప్రాంత బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. మూసీ మూసీ ప్రక్షాళన మా ప్రభుత్వంలో చేయాలనుకున్నాం. కానీ పేదల పేదల ఇల్లు కూల్చాల్సి వస్తుందని కేసీఆరే నిలిపివేశారు'- కేటీఆర్, మాజీమంత్రి