KTR on Schools in Telangana :రాష్ట్రానికి విద్యామంత్రి లేరు, ముఖ్యమంత్రికి విద్యావ్యవస్థపై పట్టింపు లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. అసలు విద్యా వ్యవస్థలో ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డికి తెలుసా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ పేద, మధ్య తరగతి విద్యార్థులను చదువుకు దూరం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థులు లేరన్న కారణంతో ఈ ఏడాది దాదాపుగా 1,864 స్కూళ్లను మూసివేసే ప్రయత్నం చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయని, ఇదే నిజమైతే ఇంతకన్నా ఆందోళన చెందాల్సిన అంశం మరొకటి లేదని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకుండా స్కూళ్లను మూసి వేయాలని భావించడం సిగ్గుచేటని ఘాటుగా వ్యాఖ్యానించారు. 2024లో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే దాదాపు 2.4 లక్షలు తగ్గిందని, ఇది రాష్ట్ర విద్యారంగానికి ప్రమాద సంకేతమని మాజీమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
ఎనిమిది నెలల కాలంలోనే ప్రభుత్వ విద్యను కాంగ్రెస్ సర్కార్ అస్తవ్యస్థం చేసిందని మండిపడ్డారు. అసలు ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతుందో గుర్తించి ఆ సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిద్రావస్థలో ఉండటంతోనే ఈ దుస్థితి దాపురించిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల సంఖ్య లేకపోవడంతోనే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గుతున్నాయని. ఖాళీగా ఉన్న దాదాపు 25 వేల టీచర్ల పోస్టులును వెంటనే భర్తీ చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
సమస్యలు పరిష్కరించాల్సింది పోయి కొత్తవి సృష్టిస్తున్నారు : సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వమే సమస్యలు సృష్టిస్తోందని కేటీఆర్ ఆక్షేపించారు. విద్యార్థులు లేరంటూ స్కూళ్లను మూసివేయటం, టీచర్లను డిప్యుటేషన్ మీద ఇతర స్కూళ్లకు పంపించటంతో చాలా చోట్ల విద్యార్థులకు ప్రభుత్వ విద్య దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. సరైన మౌలిక వసతులు లేకపోవటం, నాణ్యమైన ఆహారం అందించకపోవడం, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో శుభ్రత, భద్రత లేని పరిస్థితి నెలకొనటంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలంటేనే తల్లితండ్రులు భయపడే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆయన దుయ్యబట్టారు.