KTR on Vikarabad Collector Attack Case : సీఎం రేవంత్ రెడ్డికి తానంటే చాలా ప్రేమ ఉన్నట్లు కనిపిస్తోందని, అందుకే తనను టార్గెట్ చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మీడియా ప్రతినిధులతో పలు అంశాలపై ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. లగచర్ల భూసేకరణలో తీవ్రంగా భంగపడిన ప్రభుత్వం, దాడి వెనక బీఆర్ఎస్ కుట్ర ఉందని అంటూ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఘటన జరిగినప్పుడు అక్కడ లేని బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా తీసుకెళ్లి అమానుషంగా కొట్టారని ఆరోపించారు. సురేశ్ అనే వ్యక్తి బీఆర్ఎస్ కార్యకర్తే అని, ఆయనకు భూమి ఉందని తెలిపారు. లగచర్ల ఘటనలో పూర్తిగా ఇంటెలిజెన్స్, పోలీసుల వైఫల్యం ఉందని వ్యాఖ్యానించారు.
పట్నం నరేందర్ రెడ్డి తన పేరు చెప్పారని రిమాండ్ రిపోర్ట్‌లో రాశారని, కానీ అదంతా బక్వాస్ అని నరేందర్ రెడ్డి లేఖ రాసినట్లు కేటీఆర్ తెలిపారు. రైతులపై దాడికి పోలీసులు కూంబింగ్ ఆపరేషన్‌కు వెళ్లినట్లు వెళ్లారని వ్యాఖ్యానించారు. తనపై కేసు పెడితే ఊరుకుంటానని రేవంత్ రెడ్డి అనుకుంటే సరికాదన్న ఆయన, జైలు నుంచి వచ్చాక పోరాటం చేస్తానని తెలిపారు. తాను ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టబోనన్న కేటీఆర్, ఎస్సీ, ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్ వరకు తీసుకెళ్తానని చెప్పారు. ఫోర్త్ సిటీ, ఏఐసిటీ అని రేవంత్ రెడ్డి మాటలు చెబుతున్నారని, కానీ సాధ్యం కాదని అన్నారు.
కలెక్టర్‌పై దాడి చేసేంత బలమైన వ్యక్తులమా : కొడంగల్‌లో ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా అని అడిగిన కేటీఆర్, ప్రజలు కూడా ఇదే విషయాన్ని అడుగుతున్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రికి తన సొంత నియోజకవర్గంపై కూడా పట్టులేదని, తాము సీఎం నియోజకవర్గంలో కలెక్టర్‌పై దాడి చేసేంత బలమైన వ్యక్తులమా అని అడిగారు. ప్రాజెక్టులు, పెట్టుబడులు తేవాలంటే ఎంతో కష్టపడాలని, ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు హరీశ్‌రావు ఎంత కష్టపడ్డారో గుర్తు లేదా అని కేటీఆర్ అన్నారు. వీళ్లకు ప్రభుత్వాన్ని నడపటం చేతకావటం లేదని వ్యాఖ్యానించారు. మొన్నటి వరకు మూసీ సుందరీకరణ కోసం రూ. లక్షా 50 వేల కోట్లు అవసరమని చెప్పి, ఇప్పుడు ప్రైవేట్ వాళ్లే ప్రాజెక్ట్ చేపడతారని అంటున్నారని ఆక్షేపించారు.