Niranjan Reddy Fires on Congress : రైతుబంధు ఎగ్గొట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదో సాకులు చెబుతోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. రైతుబంధు ఇవ్వకుండా కొంత రుణమాఫీ చేసి చేతులు దులుపుకోవడం మాత్రమేనని ఆయన విమర్శించారు. సర్కార్ చర్య రైతులను తడిగుడ్డతో గొంతు కోయడమేనని మండిపడ్డారు.
రైతాంగాన్ని పూర్తిగా మోసం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైందని ఎప్పట్నుంచో చెబుతున్నామని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. అన్ని వర్గాలను ఊరించి ఉసూరుమనిపించారని, అన్నదాతలకు ఆగం పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Niranjan Reddy Slams Congress : రైతాంగాన్ని పూర్తిగా మోసం చేసేందుకు సర్కార్ సిద్ధమైందని ఎప్పట్నుంచో చెబుతున్నామన్న ఆయన అన్ని వర్గాలను ఊరించి ఉసూరు మనిపించారని, అన్నదాతలకు ఆగం పట్టిస్తున్నారని ఆక్షేపించారు. రైతుభరోసా మంత్రివర్గ ఉపసంఘం, మంత్రివర్గంలో చర్చ అయ్యేసరికి వానాకాలం అయిపోతుందని ఆక్షేపించారు. తాము గుట్టలకు ఇచ్చామని దుష్ప్రచారం చేశారని, రెండు సీజన్లు ఎందుకు సరి చేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం చెబుతున్నది శుద్ధ అబద్ధాలు, కుంటి సాకులన్న ఆయన రంధ్రాన్వేషణ పేరిట కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ చెప్పిన గొప్పలు అమలు కాని పరిస్థితి ఉందని పాలకులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్ హయాంలో రైతులకు నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, రాష్ట్ర రైతాంగం కుదుటపడిందని మాజీ మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 92.5 శాతం భూమి ఐదెకరాల లోపు ఉన్న రైతుల చేతుల్లోనే ఉందని, ఆరున్నర నుంచి ఏడు శాతం రైతులకు ఐదు నుంచి పది ఎకరాల లోపు ఉందని వివరించారు.