తెలంగాణ

telangana

ETV Bharat / politics

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీశ్​రావు పేషీ మాజీ ఉద్యోగి అరెస్ట్​ - THREE ARREST IN PHONE TAPPING CASE

స్థిరాస్తి వ్యాపారి చక్రధర్‌గౌడ్‌ ఫోన్‌ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - మాజీ మంత్రి హరీశ్‌రావు పేషీ మాజీ ఉద్యోగి వంశీకృష్ణను అరెస్టు చేసిన పోలీసులు

Three Arrest In Phone Tapping Case
Three Arrest In Phone Tapping Case (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 16, 2025, 8:23 AM IST

Phone Tapping Case Update :స్థిరాస్తి వ్యాపారి చక్రధర్‌గౌడ్‌ ఫోన్‌ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. చక్రధర్‌గౌడ్‌ ఫోన్‌ట్యాప్‌ చేసి డబ్బులు వసూలు చేసిన కేసులో పోలీసులు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు పేషీ మాజీ ఉద్యోగి వంశీకృష్ణను, అతనికి సహకరించిన సంతోష్‌కుమార్, పరశురాములును పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో ముగ్గురి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే హరీశ్‌రావు, మాజీ పోలీసు అధికారి రాధాకిషన్‌రావుపై కేసు నమోదు చేశారు.

చనిపోయిన వ్యక్తి పేరిట సిమ్‌కార్డు : ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులు మరో కొత్త విషయాన్ని గుర్తించారు. డీసీపీ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేటకు చెందిన వంశీకృష్ణ కొంతకాలంగా నల్గొండ జిల్లా ఆరోగ్యశ్రీ మేనేజర్‌గా పనిచేశారు. అక్కడ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు అతన్ని విధుల నుంచి తొలగించారు. 2023 జూన్‌లో మాజీమంత్రి హరీశ్‌రాపు పేషీలో ఉద్యోగిగా చేరి డిసెంబరు వరకు పనిచేశాడు. అక్కడ పనిచేసే సమయంలోనే సిద్దిపేటలోని భవానీ కమ్యూనికేషన్స్‌ నిర్వాహకుడు సంతోష్‌కుమార్‌, కారు డ్రైవరు పరుశురాములు పరిచయం అయ్యారు. వారి సాయంతో మరణించిన రైతు గుర్తింపుకార్డు ఉపయోగించి సిమ్‌కార్డును తీసుకున్నారు. ఈ సిమ్‌కార్డు ఉపయోగించి ఎన్నో అక్రమ కార్యకలాపాలకు తెరలేపారు. చక్రధర్ నంబర్‌కు కూడా ఆదే నంబర్‌నుంచి కాల్‌ చేసి బెదిరించారు. డబ్బులు డిమాండ్ చేశారు.

చక్రధర్‌గౌడ్‌ ఫిర్యాదులో పేర్కొన్న వాట్సాప్‌ నంబర్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు వంశీ ముఠా సాగించిన ఆగడాలను గుర్తించారు. ఈ ఫోన్‌ నంబర్‌ ఉపయోగించి నకిలీ బిల్లుల ద్వారా ఆరోగ్య శ్రీ నిధులను పక్కదాకి పట్టించవచ్చని పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు కస్టడీకి తీసుకుంటామన్నారు.

నిర్దిష్ట సమయంలోనే విచారణకు పిలువాలి :మరోవైపు శుక్రవారం ఫోన్‌ట్యాపింగ్‌ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు, ఈ కేసులో నమోదైన వారిని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు విచారించాలని పోలీసులకు న్యాయస్థానం స్పష్టం చేసింది. కాగా విచారణను న్యాయవాదిని అనుమతించాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. పంజాగుట్ట పోలీసులు తనను ఎప్పుడు పడితే అప్పుడు విచారణకు పిలుస్తున్నారని ప్రభుత్వ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి వంశీకృష్ణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. ముందస్తు సమాచారం లేకుండా పిటిషినర్​ను తీసుకెళ్తున్నారని, రాత్రి వరకు ఉంచుకుని పంపిస్తున్నారని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్‌ను నిర్దిష్ట సమయంలోనే విచారణకు పిలవాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

'18 మంది హైకోర్టు జడ్జిలపై నిఘా' - ఆ ఇద్దరిపై పోలీసుల 'ప్రకటిత నేరస్థుల' అస్త్రం

ఫోన్ ట్యాపింగ్ కేసు - భుజంగరావు, రాధాకిషన్‌రావుకు హైకోర్టు బెయిల్

ABOUT THE AUTHOR

...view details