Etela Rajender comments on Congress :తెలంగాణలో యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పట్టభద్రులు కూడా మోదీ వైపే చూస్తున్నారని, నల్గొండ, ఖమ్మంలో కూడా బీజేపీ హవా సాగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీకి 12 ఎంపీ సీట్లు వస్తాయని, నల్గొండ ఎంపీ స్థానంలో అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన నల్గొండ, ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సన్నాహక సమావేశంలో ఈటల పాల్గొని మాట్లాడారు.
సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఈటల విమర్శించారు. ఆ పార్టీపై అతి తక్కువ సమయంలోనే వ్యతిరేకత వచ్చిందని అన్నారు. హస్తం పార్టీ పాలనలో రాష్ట్రంలో కరవు ఏర్పడిందని, దందాలు, దౌర్జన్యాలు మినహా మరొకటి లేదని మండిపడ్డారు. అబద్ధాల పునాదులపైన కాంగ్రెస్ నిర్మాణమైందని విమర్శించారు. ప్రజలకు నాయకత్వం వహించే సత్తా బీజేపీకే ఉందని, దేశంలో ఎక్కడికి వెళ్లినా మోదీ కావాలి అంటున్నారని తెలిపారు. పట్టుబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్‌ను గెలిపించాలని కోరారు.
Etela Rajender on CM Revanth :గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ను ఓడించాలని కాంగ్రెస్కు ఓటేశారు తప్ప ఆ పార్టీపై విశ్వాసంతో కాని అభివృద్ధి చేస్తారేమోనని కాదని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. అతి తక్కువ సమయంలోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కరే అని విమర్శించారు. కాంగ్రెస్ నేతలపై నమ్మకంతో కాదని అప్పటి పరిస్థితుల వల్ల హస్తం పార్టీకి ఓటేశారని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ అధికారంలోకి రాగానే మళ్లీ పంటలు ఎండిపోతున్నాయని, ట్రాన్స్ఫార్మర్లు, నీటి మోటార్లు కాలిపోతున్నాయని విమర్శించారు. బీజేపీకి 400 సీట్లు అని తాము అనడంలేదని, యావత్ దేశం అంటోందని తెలిపారు.