EC Action on Tirupati Police: తిరుపతి తూర్పు పోలీసుస్టేషన్ పరిధిలో నమోదైన దొంగ ఓట్ల కేసును నీరుగార్చినందుకు ఆ స్టేషన్ ఎస్హెచ్ఓగా పనిచేసిన ఇన్స్పెక్టర్ బీవీ శివప్రసాద్‌రెడ్డి, ఎస్సై ఏ. జయస్వాములు, హెడ్‌కానిస్టేబుల్ కె. ద్వారకానాథ్‌రెడ్డి.. తిరుపతి పశ్చిమ పోలీసుస్టేషన్లో నమోదైన ఈ కేసుల దర్యాప్తును పక్కదారి పట్టించినందుకు ఇన్స్పెక్టర్ శివప్రసాద్ సస్పెండయ్యారు. ఈ మేరకు అనంతపురం డీఐజీ ఆర్.ఎన్. అమ్మిరెడ్డి ఉత్తర్వులిచ్చారు. అలిపిరి పోలీసుస్టేషన్లో నమోదైన ఇలాంటి కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం వహించినందుకు అక్కడ సీఐలుగా పనిచేసిన అబ్బన్న, దేవేంద్రకుమార్‌లను వీఆర్‌కు పంపించారు.
కేంద్ర ఎన్నికల సంఘం చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా తిరుపతిలో వ్యవస్థీకృత ఎన్నికల నేరాలు జరిగితే సూత్రధారులైన వైఎస్సార్సీపీ నాయకులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు వారితోనే అంటకాగి కేసులకు సమాధి కట్టేశారు. భవిష్యత్తులో ఎవరైనా తీగ లాగితే డొంక బయటపడుతుందన్న దురుద్దేశంతో కేసుల్లో తొలుతే తీగ తెంపేశారు. దొంగ ఓట్లు వేస్తూ పట్టుబడ్డ వారిని విచారించటం మాట అటుంచి కనీసం వారి వద్దనున్న పత్రాలనూ స్వాధీనం చేసుకోలేదు. ఉపఎన్నికల సందర్భంగా ఈఆర్వో లాగిన్, పాస్‌వర్డ్‌లను ఉపయోగించి ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేయించటం, ఇతర ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వేల మందిని తీసుకొచ్చి వారికి కార్డులు, ఓటర్లు స్లిప్పులనిచ్చి దొంగ ఓట్లు వేయించటం, అలా ఓటేస్తూ ఎవరైనా పట్టుబడి కేసు నమోదైనప్పటికీ సరిగ్గా దర్యాప్తు చేయకుండా మూసేయించటంలో అధికార పార్టీ నాయకుల నేరపూరిత కుట్ర కళ్లకు కడుతోంది. దొంగ ఓట్ల దందాను నడిపించారని ప్రతిపక్షాల ఆరోపణలు, ఫిర్యాదులను ఎదుర్కొంటున్న తిరుపతి వైకాపా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిల జోలికి ఎన్నికల సంఘం వెళ్లకపోవటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
2021 ఏప్రిల్ 17న తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక పోలింగ్ జరిగింది. నగరంలోని స్కావెంజర్స్ కాలనీలో ఉన్న నగరపాలక సంస్థ ప్రాథమికోన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద ఎస్.అయ్యప్ప అనే 21 ఏళ్ల యువకుడు.. కొసన రామచంద్ర ఎపిక్ కార్డు, ఓటరు స్లిప్పుతో ఓటేసేందుకు నిల్చోగా ప్రతిపక్షాలవారు పోలీసులకు అప్పగించారు. అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ బి.మునికృష్ణ, అయ్యప్పను తూర్పు పోలీసుస్టేషన్లో అప్పగించి ఫిర్యాదు చేశారు.
ఉపఎన్నికల్లో అక్రమాల ఫలితం- ఓ ఐఏఎస్ అధికారి సస్పెండ్ మరో ఇద్దరిపై వేటు పడే అవకాశం
దొంగ ఓట్లు వేయడం అత్యంత తీవ్రమైన నేరం కాబట్టి హెడ్‌కానిస్టేబుల్ కె.ద్వారకానాథ్‌రెడ్డి సంబంధిత కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి. అయితే ఆయన బెయిల్‌కు వీలైన తేలికపాటి సెక్షన్లు.. ఐపీసీ 171 ఎఫ్ , 188 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఫిర్యాదుదారు, పోలింగ్ అధికారులు, అక్కడ భద్రత విధులు నిర్వహిస్తున్న పోలీసులు, సంఘటన సమయంలో ప్రత్యక్షసాక్షులుగా ఉన్న ఓటర్లను కనీసం విచారించనే లేదు. నిందితుడి వద్దనున్న నకిలీ ఓటరు కార్డు, ఎపిక్ కార్డు, ఆధార్, ఇతర పత్రాలనూ సీజ్ చేయలేదు. కేసు దర్యాప్తు ఇక్కడే పక్కదారి పట్టింది.