TDP Politburo Meeting: వైఎస్సార్సీపీ హయాంలో స్థానిక సంస్థల్లో తగ్గిన బీసీ కోటా రిజర్వేషన్ పునరుద్దరించేలా చట్టపరమైన అంశాలు పరిశీలించాలని ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేతలకు సూచించారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో జిల్లాల పునర్విభజనపై చర్చించారు. నాలుగున్నర గంటలపాటు భేటీ సాగింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దాలని నిర్ణయించారు.
కడపలో టీడీపీ మహానాడు: ఈసారి తెలుగుదేశం మహానాడు కడపలో నిర్వహించాలని చర్చ జరిగింది. మహానాడు తర్వాత పార్టీ రాష్ట్ర, కేంద్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జగన్ ప్రభుత్వ నిర్వాకం వల్ల ఎఫ్ఆర్బీఎం లిమిట్ సున్నా అయిందని చంద్రబాబు విమర్శించారు. గత ఎనిమిది నెలల్లో రాష్ట్రానికి ఆరున్నర లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినా, ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లటంలో మంత్రులు, ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.
3 విడతల్లో అన్నదాత-సుఖీభవ: 2014-19 మధ్య జరిగిన తప్పిదాలు పునరావృతం కాకూడదని తేల్చిచెప్పారు. తల్లికి వందనం, అన్నదాత-సుఖీభవ పథకాలు ఈ ఏడాదే ప్రారంభించాలని సీఎం స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభవకి కేంద్రం 6 వేల రూపాయలు ఇచ్చినా మిగిలిన 14 వేలు రాష్ట్ర ప్రభుత్వమే భరించి 3 విడతల్లో 20 వేలు చెల్లిద్దామని చెప్పారు. రాష్ట్ర ఆదాయం పెంచే మార్గాలు అన్వేషిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
పీపీపీ మోడల్లో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం: బనకచర్ల ప్రాజెక్టు నిధులు పీపీపీ మోడల్లో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం, కాంట్రాక్టర్లు 50 శాతం పెట్టుకునేలా ప్రణాళికలు చేద్దామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునే 50 శాతం నిధుల్లో సగమైనా కేంద్రాన్ని అడగాలని ముఖ్యమంత్రి నేతలతో చెప్పారు.
పద్మ అవార్డులు పొందిన తెలుగువారికి అభినందనలు: అదే విధంగా పద్మ అవార్డులు పొందిన తెలుగువారికి అభినందనలు పొలిట్ బ్యూరో తెలిపింది. బాలకృష్ణకు పద్మభూషణ్ ప్రకటించటం పట్ల సభ్యులు అభినందనలు తెలిపారు. టీడీపీ సభ్యత్వాలు కోటి దాటడం పట్ల లోకేశ్‌కు అభినందనలు తెలిపారు. విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కాపాడిన సీఎంకు పొలిట్ బ్యూరో అభినందనలు తెలిపింది.
జూన్‌లోపు సూపర్-6 అమలు: సమావేశం అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. 7 నెలల్లో ఆర్థికంగా చాలా సమస్యలు వచ్చినా ప్రతినెలా 1వ తేదీనే పింఛన్లు ఇస్తున్నామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నామని, వరదల సమయంలో ప్రతిఒక్కరికి సహాయం చేశామని గుర్తు చేశారు. సూపర్-6 అమలు చేయడం లేదంటూ మాట్లాడుతున్నారని, జూన్‌లోపు సూపర్-6 అమలుకు కార్యాచరణ చేస్తున్నట్లు ప్రకటించారు.
రెండు మాసాల్లో మత్స్యకారులకు డబ్బులు చెల్లిస్తామన్న మంత్రి, యువతకు నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. వైఎస్సార్సీపీ హయాంలో తప్పు చేసిన వారిని శిక్షించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వైఎస్సార్సీపీ పెట్టిన అక్రమ కేసుల్ని నిర్ణీత కాలపరిమితిలో ఎత్తివేసేలా చూడాలని నిర్ణయించామన్నారు.
భూమి రూపంలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా వారికి చెల్లించాల్సిన మొత్తం భూమి రూపంలో ఇచ్చేలా ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు తగ్గిన 10 శాతం రిజర్వేషన్ కోటా పునరుద్ధరణ కు చట్టపరమైన అంశాలు పరిశీలిస్తున్నట్లు వివరించారు.
నియోజకవర్గాల స్థాయిలో ప్రతి శనివారం ప్రజాదర్బార్: ఈసారి మహానాడు కడప జిల్లాలో 3 రోజుల పాటు నిర్వహిస్తామని తెలిపారు. మే 27, 28 తేదీల్లో మహానాడు తీర్మానాలు, 29న భారీ బహిరంగ నిర్వహిస్తామన్నారు. మహానాడులో జాతీయ పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబుని ఎన్నుకుంటామని వెల్లడించారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల స్థాయిలో ప్రతి శనివారం ప్రజాదర్బార్ నిర్వహించాలని నిర్ణయించామని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు.
గుడ్‌న్యూస్ - త్వరలో 16,347 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్: సీఎం చంద్రబాబు