Telangana BJP New Chief Etela Rajender :లోక్‌సభ ఎన్నికల్లో 400 స్థానాలే లక్ష్యంగా ముందుకెళ్లిన బీజేపీ ఆశించిన సీట్లు సాధించకపోవడంతో కేంద్రంలో సంకీర్ణప్రభుత్వం కొలువుతీరింది. ఉత్తరాది నుంచి భంగపాటు ఎదురైనా దక్షిణాదిన కమలంపార్టీకి మంచిఫలితాలు వచ్చాయి. అందుకే కేంద్ర మంత్రివర్గంలో దక్షిణాది రాష్ట్రాల ఎంపీలకు ప్రధాని మోదీ పెద్ధ పీటవేశారు. రాష్ట్రం నుంచి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కి కేంద్రం మంత్రివర్గంలో చోటు దక్కడంతో ఆ ఇద్దరి పదవుల్లో కొత్తవారికి అవకాశం కల్పించాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. ఒక్క వ్యక్తికి ఒకే పదవి అనే నినాదంతో ముందుకెళ్తున్నందున కేంద్రమంత్రి వచ్చిన వారి నుంచి పార్టీ పదవులు తప్పించి కేబినెట్‌లో పదవి ఆశించి భంగపడిన ఎంపీలకు కట్టబెట్టాలని బీజేపీ హైకమాండ్ యోచిస్తోంది.
ఈటలకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు :2019 ఎన్నికల్లో రాష్ట్రం నుంచి నలుగురు ఎంపీలు గెలిస్తే కిషన్‌రెడ్డిని మాత్రమే కేంద్రమంత్రి పదవి వరించింది. ఈసారి 8 ఎంపీలు గెలవడంతో కిషన్‌రెడ్డి, బండిసంజయ్‌కి మంత్రులుగా ప్రమాణం చేశారు. మల్కాజ్‌గిరినుంచి అధిక మెజార్టీతో విజయం సాధించిన ఈటల రాజేందర్ కేంద్రమంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. ఆయనకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని అధిష్ఠానం యోచిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే బీజేపీ అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్‌షాతో ఈటల రాజేందర్ సమావేశమయ్యారు.