Digvijaya Singh Fires on PM Modi : నిరసన తెలిపేందుకు రైతులు దిల్లీకి రాకుండా చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. అన్నదాతలకు ప్రశ్నించే హక్కు కూడా లేకుండా పోయిందని వాపోయారు. ప్రధాని మోదీ కార్పొరేట్లకు మాత్రమే అనుకూలంగా ఉన్నారని విమర్శించారు. అదానీ లాంటి వాళ్లకు మేలు జరిగే నిర్ణయాలే వారు తీసుకున్నారని ఆక్షేపించారు. హైదరాబాద్ గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్ని మాట్లాడారు.
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. దేశంలో పెరుగుతున్న విద్వేషానికి వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ యాత్ర చేస్తున్నారని చెప్పారు. రాహుల్ తన యాత్రలో ప్రధానంగా 5 సమస్యలు పరిశీలించారని పేర్కొన్నారు. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. తమ సమస్యలు చెప్పుకునే అవకాశం రైతులకు లేకుండా పోయిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం భూసేకరణలో అన్నదాతలకు తీవ్ర అన్యాయం చేస్తోందని, భూసేకరణ చట్టం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 4 రెట్ల పరిహారం ఇవ్వాలని దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు.
'మా డిమాండ్లన్నీ పాతవే'- కేంద్రంతో చర్చలకు రైతులు సై- కర్షకులపై మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగం
Congress Document 10 Sal Anyay kaal on Modi :మోదీ పదేళ్ల పాలనపై రూపొందించిన డాక్యుమెంట్‌ను దిగ్విజయ్ సింగ్ విడుదల చేశారు. దస్ సాల్, అన్యాయ్ కాల్ (10 Sal Anyay kaal) అనే పేరుతో దీనిని రూపొందించామని చెప్పారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలపై ప్రధాని చేసిన అన్యాయాలను ఇందులో పొందుపరిచినట్లు చెప్పారు. పది సంవత్సరాల మోదీ కాలం కార్పోరేట్లకు కొమ్ముకాసిందని ఆరోపించారు. ఆయన చెప్పినట్టు ఇది అమృత్ కాల్ కాదని, దేశానికి వినాశ్ కాల్ అని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు.
'మోదీ ప్రభుత్వానికి దాదాపు పదేళ్లు అయ్యాయి. ఆ పాలనపై మేము రిపోర్ట్ విడుదల చేస్తున్నాం. ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలపై ప్రధాని చేసిన అన్యాయాలను డాక్యుమెంట్లో పొందుపరిచాం. దేశ రక్షణ విషయంలో మోదీ విఫలమయ్యారు. రక్షణ శాఖ మంత్రి ఒకటి చెప్తే ఆయన మరొకటి చెప్తారు. దేశంలో మోదీ ద్వేషాన్ని పెంచుతున్నారు. ప్రేమను పంచడానికి రాహుల్ యాత్ర చేస్తున్నారు. వసుదైక కుటుంబం మా ఆలోచన. భారత రాజ్యాంగ ఆలోచన కూడా అదే. కానీ బీజేపీ మాత్రం ప్రజలను విడగొడుతోందని' దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు.