AP Deputy CM Pawan Kalyan in Assembly Sessions:అసెంబ్లీ స్పీకర్గా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అయ్యన్నపాత్రుడు రావడం చాలా సంతోషంగా ఉందని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రెండోరోజు అసెంబ్లీ సమావేశాల్లో ముగ్గురు ఎమ్మెల్యేల ప్రమాణం అనంతరం 16వ శాసన సభాపతిగా ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు.
66 ఏళ్ల వయస్సులోనూ ఫైర్ బ్రాండే - ఏ పదవికైనా వన్నెతెచ్చిన వ్యక్తి అయ్యన్న : చంద్రబాబు - Chandrababu Naidu Comments
ముందుగా చంద్రబాబు ప్రసంగించిన అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఇన్ని దశాబ్దాల్లో ప్రజలు మీ వాడి వేడి చూశారని అయ్యన్నపాత్రుడిని ఉద్దేశించి పవన్ మాట్లాడారు. ఇప్పటివరకు ప్రజలు మీ ఘాటైన వాగ్దాటి చూశారని, ఇవాళ్టి నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారని పవన్ అన్నారు. గత ప్రభుత్వంలో వ్యక్తిగత దూషణలు చాలా ఇబ్బందిపెట్టాయని పవన్ గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ నేతల వ్యక్తిగత దూషణల కారణంగానే వారు 11 సీట్లకు పరిమితమయ్యారని పవన్ విమర్శించారు. విజయాన్ని తీసుకోగలిగారే తప్ప, ఓటమితో కూర్చోలేకనే పారిపోయారని పవన్ ఎద్దేవా చేశారు. భావంలో ఉన్న తీవ్రత, భాషలో ఉండాల్సిన అవసరం లేదని, భాష మనసులను కలపడానికి కానీ విడగొట్టడానికి కాదని ఆయన అన్నారు.