Congress Planning On Lok Sabha Election Campaign : అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి 14 స్థానాలు గెలుచుకోవాలనే పట్టుదలతో ఉంది. అన్ని కోణాల్లో పరిశీలించి అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేసేందుకు పీసీసీ కార్యవర్గం ఇవాళ సమావేశం అవుతోంది.
గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ ఇంఛార్జ్ కార్యదర్శులు రోహిత్ చౌదరి, విష్ణునాథ్ సహా ముఖ్యనేతలు పాల్గొనున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయ్యాయి. ప్రజాపాలనపై జనం స్పందన, అభివృద్ధి, సంక్షేమ పథకాలు సహా బీఆర్ఎస్ సర్కార్‌లో జరిగిన అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలను కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివరించనున్నట్లు సమాచారం.
Congress Manifesto :లోక్‌సభల్లో పార్టీ బలాబలాలు, విపక్షాలను ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలన్న అంశాలపై పీసీసీ కార్యవర్గ సమావేశంలో చర్చించనున్నారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ తీసుకొచ్చిన"పాంచ్ న్యాయ్'' (Paanch Nyay) గ్యారంటీలను జనంలోకి తీసుకెళ్లే అంశంపై సమాలోచన చేయనున్నారు. లోక్‌సభ ప్రచారాన్ని ఏవిధంగా ఉండాలి? ఎవరెవరు ప్రచారంలో పాల్గొనాలి? సభలు నిర్వహణ వంటి అంశాలను ఖరారు చేయనున్నారు. వచ్చే నెల 6న తుక్కుగూడలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభపై పీసీసీ కార్యవర్గం చర్చించనుంది.