TPCC Focus On Nominated Posts Appointments : తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ నాయకులు అవిశ్రాంతంగా పని చేశారు. అభ్యర్థుల గెలుపునకు కొంతమంది పని చేస్తే, మరికొందరు నాయకులు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ బలోపేతం కోసం పని చేశారు. ఇంకొంత మంది అసెంబ్లీ టికెట్లు ఆశించి, నిరాశకు గురైన నాయకులు కూడా ఉన్నారు.
గతంలో ఇచ్చిన హామీలో భాగంగానే :టికెట్లు కోల్పోయిన నాయకులకు అటు ఏఐసీసీ, ఇటు పీసీసీ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం రాగానే నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పిన మాట నిలబెట్టుకోవాల్సి ఉందని ఆ పార్టీ చెబుతోంది. అందులో భాగంగానే హస్తం పార్టీ అధికారంలోకి రాగానే నలుగురు సలహాదారులతో పాటు టీ-శాట్ సీఈవో, ఆర్థిక కమిషన్ ఇలా కొన్ని నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. మరో 37 నామినేటెడ్ ఛైర్మన్ పోస్టుల భర్తీ కూడా పార్లమెంట్ ఎన్నికల ముందు జరిగింది.
కానీ ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో వారెవరూ బాధ్యతలు స్వీకరించలేదు. గురువారంతో కోడ్ ముగియడంతో ప్రభుత్వ కార్యకలాపాలతో పాటు పాలనా వ్యవహారాలు కూడా ఇవాళ్టి నుంచి ఊపందుకున్నాయి. ఈ 37 మంది ఛైర్మన్లు ఒకట్రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Social Equations In Nominated Posts : సామాజిక సమీకరణాల సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని మొదటి జాబితాలో ఛైర్మన్ పదవులు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేకపోయారు. ఉద్యమకారులకు మొదటి విడతలో ఇచ్చిన 37 పదవుల్లో అవకాశం కల్పించింది తక్కువేనన్న భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యమంలో పాల్గొనడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉండి పని చేస్తున్న నాయకులకు పదవులు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా నామినేటెడ్ పోస్టుల భర్తీపై తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే స్థాయి నాయకులకు :అయితే కీలకమైన విద్యా మిషన్, హైయర్ ఎడ్యుకేషన్ ఛైర్మన్, వ్యవసాయ కమిషన్‌లతో పాటు విశ్వ విద్యాలయాలకు వీసీల నియామకం తదితర వాటి భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆకునూరి మురళి, అల్తాఫ్ జానయ్య, కోదండ రెడ్డిలకు ఈ పదవులు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా మూసీ నది అభివృద్ది కార్పొరేషన్, ఆర్టీసీ కార్పొరేషన్, పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్‌లు ఎమ్మెల్యే స్థాయి నాయకులకు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల్లో విజయం కోసం పనిచేసిన వారికి :వందకు పైగా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులు ఉండగా, ఇప్పటి వరకు 50 లోపే భర్తీ కాగా, మిగిలినవి నియామకాలు చేయాల్సి ఉంది. కొత్తగా పార్టీలో చేరిన వారికి, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన వారికి ఎలాంటి నామినేటెడ్ పోస్టులు లేవని పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పీసీసీ వర్గాలు చెబుతున్న సమాచారం మేరకు రెండో విడత నామినేటెడ్ పోస్టుల కోసం పోటీ పడుతున్న వారిలో పలువురు ఉన్నారు. వారిలో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అనుబంధ సంస్థలకు చెందిన నాయకులతో పాటు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన వారున్నారు.
పార్టీ వాయిస్‌ను వినిపించే నేతలకు :నిత్యం టీవీల్లో జరుగుతున్న చర్చలో పార్టీ తరఫున పాల్గొంటూ మాట్లాడుతున్న అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, భవాని రెడ్డి, చరణ్ కౌసిక్ యాదవ్‌లు, పార్టీ కోసం పని చేసిన కైలాస్ నేత, చారగొండ వెంకటేష్ తదితరులతో పాటు జిల్లా స్థాయిల్లో గాంధీభవన్‌లో పార్టీ కోసం పూర్తిగా అంకితమై పని చేస్తున్న నాయకులు కూడా నామినేటెడ్ పోస్టులను ఆశిస్తున్నారు.
విద్యార్హతలు, సేవలు పరిగణనలోకి :నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో గతంలో మాదిరి కాకుండా, ఆయా ఛైర్మన్లుగా నియామకమయ్యే వారు బాగా పని చేసి పార్టీకి మంచి పేరు తెచ్చేట్లు వారి విద్యార్హతలు, సేవలను దృష్టిలో ఉంచుకుని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఆరు మంత్రి పదవులను, ప్రభుత్వ చీఫ్ విప్‌లను కూడా భర్తీ చేయాల్సి ఉంది. పార్టీ సీనియర్ నాయకుడు, బోధన్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాళ్ల ప్రేమసాగర్ రావు, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్‌లు, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌లు మంత్రి పదవులను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
నామినేటెడ్ పదవులపై పూర్తి అధికారం ముఖ్యమంత్రికే : భువనగిరి ఎంపీగా చామల కిరణ్‌కుమార్ రెడ్డిని గెలిపించుకుని వస్తే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వనున్నట్లు పార్టీ మాట ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆరు మంత్రి పదవులే ఉండటం, అవి కూడా సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని భర్తీ చేయాల్సి ఉండడంతో ఇందులో కొందరికి మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ పదవిని కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఈ మంత్రి పదవుల విషయంలో పూర్తి స్వేచ్ఛ సీఎం రేవంత్ రెడ్డికి ఉంటుంది. అయినా కూడా ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లి చర్చించిన తర్వాత పార్టీకి ప్రయోజనం చేకూర్చే రీతిలో నిర్ణయం తీసుకుని మంత్రి పదవులను, చీఫ్ విప్ పదవిని సీఎం భర్తీ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాంగ్రెస్‌లో నామినేటెడ్ పోస్టుల లొల్లి - ఆచితూచి అడుగులు వేస్తున్న అధిష్ఠానం
నామినేటెడ్ పదవుల భర్తీకి కాంగ్రెస్ కసరత్తు - టికెట్ త్యాగం చేసిన వారికే ప్రాధాన్యం