Congress MP Mallu Ravi Fires On Opposition Parties : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాభివృద్ది కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని, ప్రతిపక్షాల దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని కాంగ్రెస్ నేతలు అన్నారు. రాజ్యాంగ హక్కులను కాలరాయాలని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చూస్తున్నాయని ఆరోపించారు. హైడ్రా, మూసీ వల్ల ప్రజలకు తాత్కాలిక ఇబ్బందులు ఉంటాయని, కానీ లక్షల మందికి లాభం జరుగుతుందని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి తెలిపారు. గాంధీభవన్‌లో మల్లు రవితో పాటు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రీతం, బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్లు మాట్లాడారు.
బీఆర్ఎస్ హయాంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిందని, పదేళ్లలో 5 వేల పాఠశాలలు మూతపడ్డాయని మల్లు రవి ఆరోపించారు. రాష్ట్రంలో 28 నియోజకవర్గాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు అంతా ఒకే చోట చదువుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని వివరించారు.
"గత పది సంవత్సరాల్లో బంగారు తెలంగాణ అని నామం జపిస్తూ బంగారు నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారు బీఆర్ఎస్ నేతలు. ఆయన ( కేసీఆర్) ఉండేదాన్ని ప్రగతి భవన్ పేరుతో అక్కడ ఉన్న పది బిల్డింగ్లు పడగొట్టి, మనం ఊహించనంత భవంతిని నిర్మించారు. వంద సంవత్సరాలు ఉపయోగపడే సెక్రటేరియట్‌ను పడగొట్టి వేయి కోట్ల రూపాయలతో ప్రపంచ స్థాయి సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. ఎవరికి ఉపయోగపడుతుంది ఆ కట్టడం. ఎవరికోసం అంత ప్రజాధనం వృథా చేశారు."-మల్లు రవి, నాగర్‌కర్నూల్ ఎంపీ