Congress MP Candidates Kadiyam Kavya, Balaram Nayak Win : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్‌పోల్స్ అంచనాలకు తగ్గట్లుగానే కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా దూసుకెళ్తున్నాయి. హస్తం పార్టీ ఆరు స్థానాలు ఖాతాలో వేసుకోగా, మరో రెండింట ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే వరంగల్‌లో కడియం కావ్య రెండు లక్షల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు.
కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంలో పోస్టల్ బ్యాలెట్ అయ్యే సరికి బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ, క్రమక్రమంగా వెనుకంజయి రెండో స్థానంలో నిలవగా, బీఆర్ఎస్ అభ్యర్థి సంజీవ్‌కుమార్ మూడు స్థానానికి పరిమితమయ్యారు. మహబూబాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ గులాబీ పార్టీ అభ్యర్థి కవితపై 3 లక్షల 24 వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందారు.
గెలుపు ప్రస్థానంలో మలుపులెన్నో : ఉమ్మడి వరంగల్‌లోని ఎస్సీ, ఎస్టీ రెండు రిజర్వ్ స్థానాలపై ఆది నుంచి కాంగ్రెస్ పార్టీ తర్జనభర్జన పడింది. అభ్యర్ధుల ఎంపికపై ఆచితూచి అడుగులు వేసింది. వరంగల్ స్ధానానికి గతంలో ఎప్పుడూ లేనంతగా కాంగ్రెస్ నుంచి తీవ్ర పోటీ నెలకొంది. 42 మంది ఆశావహులు టిక్కెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేయగా, దిల్లీ పెద్దలచుట్టూ తమకే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తమకే టికెట్ దక్కుతుందని ధీమా వ్యక్తం చేసినా చివరకు కడియం కావ్యను అదృష్టం వరించింది.
ఈమేరకు మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యను అభ్యర్థిగా హస్తం ప్రకటించింది. తొలుత బీఆర్ఎస్ అభ్యర్థిగా కావ్య పేరును ఖరారు చేయడంతో, కేసీఆర్‌ను కలిసి పోటీచేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఆ తర్వాత పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు కేసీఆర్‌కు లేఖ రాయడం, బీఆర్ఎస్ పార్టీ నుంచి వైదొలగి సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరడం వంటి ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య చేజిక్కుంచుకున్న పార్లమెంట్ స్థానం, భారీ ఆధిక్యంతో కావ్య వశమైంది.
కాంగ్రెస్ వశమైన మానుకోట - భారీ ఆధిక్యంలో బలరాం నాయక్ గెలుపు : మహబూబాబాద్‌లో జరిగిన 2009 పార్లమెంట్ ఎన్నికల్లో తొలిసారి ఇక్కడి నుంచే పోటీచేసి, బలరాం నాయక్ ఎంపీగా విజయం సాధించారు. అప్పట్లో కేంద్రంలో హస్తం పార్టీ అధికారంలో ఉండటంతో కేంద్ర సామాజిక , సాధికారత, న్యాయశాఖ సహాయమంత్రిగా పని చేశారు.
అనంతరం రెండు సార్లు వరుసగా 2014 లో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ చేతిలో, 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీచేసిన మాలోత్ కవిత చేతిలో బలరాంనాయక్ ఓడిపోయారు. ఈదఫా ఎన్నికల్లో మాత్రం ప్రత్యర్థి మాలోత్ కవితపై 3.24 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందారు.
"మహబూబాబాద్ పార్లమెంట్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తాను. తన గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు చేస్తున్నాను. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆశీస్సులు, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన పాదయాత్రలు తన గెలుపునకు దోహదపడ్డాయి. యూపీఏ ప్రభుత్వ మేనిఫెస్టోలో ఇచ్చిన వాటన్నింటిని అమలు చేసి తీరుతాము."-బలరాం నాయక్, మహబూబాబాద్ ఎంపీ
ఉమ్మడి వరంగల్‌లో కాంగ్రెస్ జయకేతనం - భారీ మెజారిటీతో గెలుపొందిన కడియం కావ్య, బలరాం నాయక్ (ETV Bharat)