Congress Leader Priyanka Gandhi Election Campaign in Tandur : రాజ్యాంగాన్ని పూర్తిగా తొలగించే ప్రయత్నం దేశంలో జరుగుతోందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేదలను ఆదుకునే పథకాలేమీ ఉండవని విమర్శించారు. తాండూరు జన జాతర సభలో పాల్గొన్న ప్రియాంక గాంధీ బీజేపీపై విరుచుకుపడ్డారు. తెలంగాణ అంటే తనకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు.
ఇందిరాగాంధీని తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టి చూసుకున్నారని, ఆ తర్వాత సోనియమ్మపై అభిమానం చూపించారని ఆనందం వ్యక్తం చేశారు. దేశ ప్రజలు చెప్పే సమస్యలు వినటానికి కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కాంగ్రెస్ నేతలు భావిస్తారని అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో గ్యాస్ సిలిండర్ ధర రూ.1200 ఉందని కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో రూ.500కే ఇస్తున్నట్లు తెలిపారు.
Congress Leaders Election Campaign in Telangana :రైతులు, నిరుపేదలు, మహిళల కోసం బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయదని మండిపడ్డారు. బీజేపీ పాలనలో పేదలపై వేసే పన్నులు నిరంతరం పెరుగుతూనే ఉంటాయని, పేద రైతులకు రూ.50 వేలు, రూ.లక్ష రుణాలు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద రైతులకు రుణమాఫీ చేసేందుకు బీజేపీ సర్కార్ అంగీకరించదని అన్నారు. బడా వ్యాపారులకు మాత్రం బీజేపీ సర్కార్ రూ.16లక్షల కోట్లు రుణమాఫీ చేసిందని ఆరోపించారు. కీలకమైన సంస్థలను తమ చెప్పుచేతుల్లో పెట్టుకుని ఆడిస్తారన్నారు.
ఈ 75 ఐదేళ్లలో ఎవరి పాలనలో అభివృద్ధి, మార్పు జరిగిందో గమనించాలి. ప్రజలు ఎలా బతుకుతున్నారో తెలుసుకునే ప్రయత్నాన్ని మోదీ ఎప్పుడూ చేయరు. ఎన్నికల వచ్చినప్పుడు మాత్రం వచ్చి ధర్మం అనే నినాదం ఎత్తుకుంటారు. ప్రజల మధ్య మతం చిచ్చు పెట్టి ఓట్లు వేయించుకుంటారు. కాంగ్రెస్‌పై బీజేపీ నేతలు ఎన్నో అబద్ధాలు చెప్తున్నారు. కాంగ్రెస్ కొందరి ఆస్తులు గుంజుకుని మరో వర్గానికి ఇస్తుందని బీజేపీ దుష్ప్రచారం చేస్తోంది. ధర్మం పేరిట అన్నదమ్ముల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. ధర్మం పేరిట ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోంది. రద్దు చేయడానికి ఈ రాజ్యాంగాన్ని మోదీ రాయలేదు. మన పూర్వీకులు ఎంతో కృషి చేసి భావితరాల కోసం రాజ్యాంగం రూపొందించారు- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నేత