37 నామినేటేడ్ పదవుల కేటాయింపుపై అసంతృప్తి పున:పరిశీలన యోచనలో పీసీసీ (ETV Bharat) TPCC On Nominated Posts : రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో పార్టీ కోసం కీలకంగా పనిచేసిన నాయకులకు నామినేటెడ్ పోస్టులివ్వాలని. రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. పదేళ్లుగా అధికారంలో లేకున్నా పార్టీని అంటిపెట్టుకున్న కార్యకర్తలు, నేతలు ఛైర్మన్ పదవులు ఆశిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 37 మందికి కార్పోరేషన్ పదవులను హస్తం పార్టీ ప్రకటించింది. వెంటనే పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వారు పదవీ బాధ్యతలు చేపట్టలేదు.
ఆ 37 మందిలో కొందరికి కేటాయించిన నామినేటెడ్ పదవులపై పార్టీ నాయకత్వం సంతృప్తిగాలేనట్లు తెలుస్తోంది. పార్టీకి సేవలు చేసిన దాఖలాలు లేని వారికి పదవులిచ్చారంటూ కొందరు పీసీసీపై తీవ్ర ఒత్తడి తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేటాయిస్తామని వారికి సర్దిచెప్పారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు పూర్తికావడంతో పార్టీ నాయకత్వంపై ఆశావహులు ఒత్తిడి పెంచే పనిలో పడ్డారు. తొలి జాబితాలోని 37 మందితోపాటు తమకూ పోస్టింగ్‌లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రంలోని కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం - 37 మంది కాంగ్రెస్ నాయకులకు పదవులు
వచ్చేనెల 6వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా విద్య, వ్యవసాయ రంగాలకు చెందిన ఛైర్మన్లు బాధ్యతలు చేపట్టడం ద్వారా విద్యార్ధులు, వ్యవసాయ కార్యకలాపాల ప్రయోజనాలు నెరవేరతాయని రాష్ట్ర నాయకత్వం భావించింది. ఎన్నికల కమిషన్ అనుమతితో ఆయా ఛైర్మన్లను బాధ్యతలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తరుణంలో కొత్తగా నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న నాయకులంతా అంతా ఒకేసారి బాధ్యతలు తీసుకునేట్లు చూడాలని కోరారు.
Nominated Posts in Telangana :అలా జరగకుంటే పార్టీకి పార్టీ కోసం సేవచేసినా పదవులు రాలేదన్న ప్రచారం తీవ్ర ఇబ్బందికి గురిచేస్తుందని కొందరు నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా తాత్కాలికంగా 37 నామినేటెడ్ పదవుల బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఆగినట్లు విశ్వసనీయసమాచారం. కొత్తగా విద్య, వ్యవసాయ కమిషన్లతోపాటు ఉన్నత విద్యా కార్పోరేషన్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలెప్‌మెంట్, ఆర్టీసీ ఇలా మరో 20కిపైగా నామినేటెడ్ పోస్టులను అర్హులైన నాయకులతో భర్తీ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
నామినేటెడ్ పదవుల భర్తీకి కాంగ్రెస్ కసరత్తు - టికెట్ త్యాగం చేసిన వారికే ప్రాధాన్యం
పార్లమెంట్ ఎన్నికల నియమావళి వస్తుందని హడావుడిగా ఎంపిక చేసిన 37 నామినేటెడ్ పోస్టుల భర్తీని పునఃపరిశీలన చేయాలని పీసీసీ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రధానంగా నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న వారి విద్యార్హత, ఆయా రంగాల్లో ఉన్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా వారికిచ్చే పదవులకు న్యాయం చేయడం సహా సర్కారికి ప్రయోజనం కలుగుతుందని అంచనా వేస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిసేలోగా కసరత్తు పూర్తిచేసి జాబితాను సిద్ధం చేసుకోవాలని పీసీసీ భావిస్తోంది. అర్హతలు, అనుభవాల విషయంలో ఇప్పటికే ప్రకటించిన ఛైర్మన్ల పదవులను పరిగణనలోకి తీసుకుంటారా లేక ఇప్పుడు కొత్తగా ప్రకటించనున్న పదవులకే వర్తింపజేస్తారా అన్న విషయమై స్పష్టతలేదు. రాష్ట్రస్థాయి నాయకులకు వందకుపైగా ఛైర్మన్ల పదవులు ఇస్తుండగా నియోజకవర్గ స్థాయి నేతలకు మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, డైరెక్టర్లు, దేవదాయ శాఖ ట్రస్ట్ బోర్డులు, అందులో సభ్యులుగా అవకాశం ఇచ్చేలా పార్టీ రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తోంది. పార్టీ కోసం కష్టపడి పని చేసిన, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన, పార్టీ అధికారంలో లేకపోయినా ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా విధేయులుగా ఉన్న వారికి న్యాయం జరిగే పదవులు కట్టబెట్టేందుకు కసరత్తు కొనసాగుతోంది.
కాంగ్రెస్లో నామినేటెడ్ పోస్టుల లొల్లి - ఆచితూచి అడుగులు వేస్తున్న అధిష్ఠానం