Congress Attack On Opposition :అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించి అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లోను అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలన్న వ్యూహంతో ముందుకు వెళుతోంది. ఇప్పటికే 14 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ప్రచారంపై దృష్టి సారించింది. గడిచిన నాలుగు నెలల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు జాతీయ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు, అయిదు గ్యారంటీలను ఇంటింటికి తీసుకెళ్లడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేయాలని భావిస్తోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేసిన కాంగ్రెస్ ప్రచారంలోనూ దూసుకుపోయేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంది. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అవాస్తవమని చెప్పేందుకు వీలుగా కసరత్తు చేసిన తరువాతనే పార్టీ నాయకులు మీడియా ముందుకు వెళ్లాలని నిర్ణయించింది.
గ్యారంటీలే ప్రతిపక్షాలకు అస్త్రంగా : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 120 రోజులైనా ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని, రైతు రుణమాఫీ, రైతుబంధు ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వలేదని, ఇలా వివిధ విమర్శలు చేస్తున్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రలు కేటీఆర్, హరీష్‌రావులతో పాటు పలువురు సీనియర్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఈ ప్రభుత్వం తమకు అనుకూలంగా మార్చుకొని సోమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తుందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తుందే తప్ప అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని బీజేపీ నాయకులు తమ ప్రచారంలో అస్త్రంగా వాడుతున్నారు.
Congress Leaders Counter To Oppositions :కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాల విమర్శలపై స్పందించే నాయకులు తగ్గారు. మంత్రులు, సీనియర్ నాయకులు ఆశించిన స్థాయిలో స్పందించడం లేదు. దీంతో లోక్సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు పార్టీకి నష్టం కలిగిస్తాయని కాంగ్రెస్ అంచనా వేసింది. ప్రతిపక్షాల విమర్శలకు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారని రాష్ట్ర నాయకత్వం గుర్తించింది. ఇది ఇలాగే కొనసాగితే ప్రభుత్వంపై మచ్చ పడడంతో పాటు పార్టీకి కూడా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని, ఎన్నికల్లో కూడా ప్రభావం చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తుంది.