CM Revanth Chit Chat Comments on KCR : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంటే కేసీఆర్ రాననడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్‌ను ఓ కమర్షియల్ వ్యాపారిగా పోల్చిన సీఎం, తెలంగాణను ఆయన వ్యాపార వస్తువులా మార్చి గత పదేళ్లపాటు లాభాలు పొందారని ఆరోపించారు. ఇంకా లాభాలు పొందాలని చూస్తున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు.
కేసీఆర్‌కు ఇష్టం లేకనే రావడం లేదు : శనివారం సాయంత్రం తన నివాసంలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు రమ్మని ఆహ్వానిస్తే రానంటున్న కేసీఆర్, అసెంబ్లీకి వస్తానంటే నమ్మేదెవరని ప్రశ్నించారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఒకరోజు ముందుగానే గన్‌పార్క్‌కు వెళ్లడానికి ఆయన ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్నారా అని అడిగారు. ఒకరోజు ముందుగా అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లడం ఎందుకన్న రేవంత్, పాకిస్థాన్ మాదిరిగా ఒకరోజు ముందుగానే ఉత్సవాలను చేసుకుంటున్నారని విమర్శించారు. అవతరణ వేడుకలంటే కేసీఆర్‌కు ఇష్టం, గౌరవం లేకనే రావడం లేదని చెప్పారు. ఇలా హాజరుకాని ప్రధానప్రతిపక్ష నాయకుడెవరైనా ఉంటారా అని? రేవంత్‌రెడ్డి అన్నారు.
తెలంగాణ గీతం రాసిన అందెశ్రీ ఎవరని అంటున్న మాజీ ముఖ్యమంత్రికి మానసిక స్థితి బాగా లేనట్టుందని రేవంత్‌రెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. రాష్ట్ర గీతం తయారీ బాధ్యతంతా అందెశ్రీకే అప్పగించామని చెప్పారు. గీతం పాడిందెవరనే దానికి ప్రాధాన్యం లేదన్నారు. అధికారిక చిహ్నంపై మార్పులు చేయాలా వద్దా అనే అంశంపై బీఆర్ఎస్ తన అభిప్రాయం ప్రభుత్వానికి చెప్పకుండానే, ముందుగానే ఎందుకు ధర్నాలు చేసిందని ప్రశ్నించారు. వారి ఉద్దేశం ఏంటనేది కనీసం వినతిపత్రం కూడా ఇవ్వకుండా నిరసనలతో వారి అభిప్రాయం చెప్పిన తర్వాత ఇక వారిని సర్కార్ ఏం అడుగుతుందని రేవంత్‌రెడ్డి తెలిపారు.