తెలంగాణ

telangana

ETV Bharat / politics

'సీఎం కావాలనుకున్నా, అయ్యాను - నా గేమ్​ ప్లాన్‌పై పూర్తి స్పష్టతతో ఉన్నా'

మూసీ పునరుజ్జీవంపై కావాలనే చర్చకు తెరలేపాను - ఈ చర్చతో మూసీని బాగు చేసేవాడొకడు వచ్చాడని ప్రజలకు తెలిసింది - నవంబర్‌ 1న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన

CM Revanth Reddy
CM Revanth Reddy Chit Chat (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 29, 2024, 4:24 PM IST

Updated : Oct 29, 2024, 9:22 PM IST

CM Revanth Reddy Chit Chat : మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ముందడుగే కానీ, వెనకడుగు వేసే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నిర్ణయం తీసుకునే ముందే వెయ్యిసార్లు ఆలోచిస్తామని, నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. నవంబర్‌ 1న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామన్న ఆయన, బాపూఘాట్‌ నుంచి పనులు స్టార్ట్ చేయనున్నట్లు వివరించారు. ఈ మేరకు మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

ఈ సందర్భంగా నవంబర్‌లోపు మూసీ ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలుస్తామని సీఎం పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులపై ప్రతిపక్షాలతో చర్చలకూ సిద్ధమని ప్రకటించారు. మూసీ పునరుజ్జీవంపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామన్న ఆయన, బీఆర్‌ఎస్‌ వాళ్లు తమ అభ్యంతరాలను తెలియజేయాలన్నారు. తనను కలవటం అభ్యంతరమైతే మంత్రులు, అధికారులను కలిసి అభ్యంతరాలు చెప్పొచ్చని, విపక్షాలు ప్రతిపాదనలు సూచించవచ్చని తెలిపారు.

నా కల నెరవేరింది : ఫోన్‌ ట్యాపింగ్‌, కాళేశ్వరం, విద్యుత్‌ కొనుగోళ్లపై విచారణ కొనసాగుతోందని సీఎం చెప్పారు. విచారణ విషయంలో కక్షసాధింపు ఉండదన్న ఆయన, దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగానే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాజకీయంగా నష్టం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రజలకు చేయాలనుకున్న మేలు చేసి తీరతామన్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న తన కల నెరవేరిందన్న రేవంత్ రెడ్డి, ఈ పదవి కంటే పెద్ద కలలు తనకు వేరే ఏమీ లేవన్నారు.

మూసీ పునరుజ్జీవంపై కావాలనే చర్చకు తెరలేపానని సీఎం పేర్కొన్నారు. ఈ చర్చతో ప్రజలకు అవగాహన కలిగిందని తెలిపారు. మూసీని బాగు చేసేవాడొకడు వచ్చాడని ప్రజలకు తెలిసిందన్నారు. తాను ఫుట్‌బాల్‌ ప్లేయర్‌నని, గేమ్‌ ప్లాన్‌పై తనకు పూర్తి స్పష్టత ఉందని వెల్లడించారు. 55 కి.మీ. మూసీ పునరుజ్జీవం పూర్తయితే అద్భుతనగరం ఆవిష్కృతమవుతుందని, పర్యాటకం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి హైదరాబాద్‌ నుంచే 65 శాతం ఆదాయం వస్తోందని, మరింత పెంచుతామని వివరించారు.

'మూసీ కోసం భూములిచ్చే వారికి 100 శాతం సంతృప్తి చెందేలా ప్యాకేజీ ఇస్తాం. మూసీ కోసం ప్రజలను కష్టపెట్టి భూములు తీసుకోబోం. మూసీ ప్రాజెక్టును ఎన్జీవోలు వ్యతిరేకిస్తే అర్థం ఉంది. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావట్లేదు. కేటీఆర్‌ ప్రపంచ స్థాయి మేధావినని అనుకుంటారు. మూసీని బాగు చేసే అంశంలో కేటీఆర్‌ తన ఆలోచనలు చెప్పొచ్చు. అంతర్జాతీయ అవగాహన ఉన్న కేటీఆర్‌కు మూసీని ఎలా బాగు చేయాలో తెలియదా? మూసీ పునరుజ్జీవంపై కేటీఆర్‌ నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నాం. మూసీపై కేటీఆర్‌, హరీశ్‌రావు, ఈటల తమ ప్రతిపాదనలు తెలపాలి' అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Last Updated : Oct 29, 2024, 9:22 PM IST

ABOUT THE AUTHOR

...view details