CM Revanth On PM Modi Comments : గత పదేళ్లలో నెలకొన్న చీకటి, నిరాశను తాము గత 11 నెలల్లో పారదోలామని, తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం సూర్యుడిలా ఉదయిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలపై స్పందించిన సీఎం, ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల సదుపాయాన్ని అమల్లోకి తీసుకొచ్చామని సీఎం తెలిపారు.
దేశంలోనే అతి పెద్ద రుణమాఫీ :ఏడాది కూడా కాకముందే దేశంలోనే అతి పెద్ద రుణమాఫీ అమలు చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి, 22 లక్షల మందికి పైగా రైతులకు రూ.2 లక్షల వరకు రూ.18 వేల కోట్ల రుణాలు మాఫీ చేసి, కేవలం 25 రోజుల్లోనే జమ చేసినట్లు తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని పొందుతున్నందుకు మహిళలు తమను ఆశీర్వదిస్తున్నారని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అధిక గ్యాస్ ధరలతో ఇబ్బంది పడుతుంటే, తెలంగాణలో రూ.500 సిలిండర్ ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
ఉద్యోగ నియామకాలు: దశాబ్ద కాలం పాటు పరీక్షలు, ఉద్యోగాల నియామకాల్లో విఫలమైతే, కాంగ్రెస్ ప్రభుత్వం అధిక సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టడంతో పాటు గ్రూప్స్ పరీక్షలను రెగ్యులర్గా నిర్వహిస్తోందని తెలిపారు. 11 నెలలలోపే కాంగ్రెస్ ప్రభుత్వం 50 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టిందని, బీజేపీ పాలిత ఏ రాష్ట్రంతో పోల్చినా ఇది రికార్డ్ అని స్పష్టం చేశారు.