CM Revanth Meets Rahul Gandhi :ప్రధాని మోదీని తాను వ్యక్తిగతంగా తిట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానిని కించపరిచేలా మాట్లాడలేదన్నారు. వ్యక్తిగతంగా, పదవి పరంగా కించపరచలేదని వివరణ ఇచ్చారు. కేవలం మోదీ పుట్టుకతో బీసీ కాదని మాత్రమే అన్నానని, మోదీ పుట్టకతో బీసీ కాదు కాబట్టే బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని అన్నానని వివరించారు. తాను చేసిన వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి, బండి సంజయ్ వక్రీకరించారని తెలిపారు. మోదీకి చిత్తశుద్ధి ఉంటే జనగణనలో కులగణన కూడా చేయాలని సవాల్ విసిరారు. దిల్లీలోని టెన్ జన్‌పథ్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మంత్రివర్గ విస్తరణపై రాహుల్ గాంధీతో చర్చించలేదని చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు తెస్తామన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటామని స్పష్టం చేశారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై కమిషన్ అధ్యయనం చేస్తోందని సీఎం వివరణ ఇచ్చారు. కులగణన, ఎస్సీ వర్గీకరణలో రాజకీయ జోక్యం లేదన్నారు.
కులగణన అమలుకు కమిటీ లేదా కమిషన్ : ఏకసభ్య కమిషన్ నివేదికను యథాతథంగా అమలు చేస్తామని వెల్లడించారు. కులగణన అమలుకు కమిటీ లేదా కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆ కమిటీ లేదా కమిషన్ ఇచ్చే నివేదికను చట్టరూపంలోకి తెస్తామని మాటిచ్చారు. ప్రత్యేక అసెంబ్లీ సెషన్ పెట్టి చట్టరూపంలోకి తెస్తామన్నారు. ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్రమూ కులగణన చేయలేదని, తెలంగాణ కులగణన దేశానికే రోడ్‌మ్యాప్ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాహుల్ గాంధీతో భేటీ, మీడియాతో ఇష్టాగోష్ఠి ముగిసిన అనంతరం సీఎం రేవంత్ హైదరాబాద్ బయలుదేరారు.