CM Revanth Reddy Challenge to BRS Leaders : రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తే, బీఆర్ఎస్ను రద్దు చేసేందుకు సిద్ధమేనా అంటూ హరీశ్‌రావుకు ఛాలెంజ్ చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు.
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, పార్టీ నేతలతో కలిసి నారాయణపేట జిల్లా మద్దూరులో జరిగిన కార్యకర్తల సమావేశానికి సీఎం హాజరయ్యారు. రైతుల రుణమాఫీ చేసి తీరుతామన్న సీఎం, బ్యాంకు అధికారులు అన్నదాతలను ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు. కాదని అలా చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. వచ్చే వరి పంటకు బోనస్ అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
"నేను చేసిన రుణమాఫీ ప్రకటనపై హరీశ్‌రావు చేసిన సవాల్‌కు నేను సిద్ధం. మరి రుణమాఫీ ఆగస్టు 15 లోపల పూర్తి చేస్తే బీఆర్ఎస్ పార్టీ రద్దు చేసేందుకు సిద్ధమా, దీన్ని మీరు స్వీకరిస్తారా? అదేవిధంగా రైతులతో బ్యాంకు అధికారులు జాగ్రత్తగా నడుచుకోవాలి. అన్నదాతల అప్పులకు వడ్డీతో సహా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. రైతులను ఇబ్బంది పెట్టొద్దు. కాదని ఇబ్బంది పెడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు." - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
Revanth Reddy Comment on DK Aruna :పదేళ్ల కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం నాశనమైందని, ఒక్కో పనిని చక్కదిద్దుతూ, వారు చేసిన అప్పులు చెల్లిస్తూ వస్తున్నామన్నారు. పాలమూరు జిల్లాలో తనకు శత్రువులు లేరు ప్రత్యర్థులు లేరన్నారు. రాష్ట్రాన్ని పాలించే స్థాయిలో ఉన్నామని, అభివృద్ది చేసుకుందామన్నారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావుకు ఛాన్స్ వస్తే, మళ్లీ ఇప్పుడు పాలమూరు బిడ్డకు దక్కిందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా ఉన్న డీకే అరుణ, ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదని, శత్రువు చేతిలో చురకత్తై పాలమూరు కంట్లో పొడుస్తున్నారని విమర్శించారు.