CM Chandrababu Fires on Jagan for Talking about EVMs:ఈవీఎంలపై చెత్త మాటలు మాట్లాడటానికి జగన్కు సిగ్గుండాలని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రానికి జగన్ అతి పెద్ద అరిష్టమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్య పదజాలానికి మారు పేరుగా వైఎస్సార్సీపీ మారితే, బూతుల్ని పేటెంట్గా ఆ పార్టీ నేతలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు జరుగుతున్న నష్టంపై ఒక్కసారి కూడా నోరుమెదపని వారు ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తారా అని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కాకూడదని, అదే సమయంలో నష్టాలకు ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని సీఎం చంద్రబాబు కోరారు.
కేంద్ర పథకాలను త్వరితగతిన అందిపుచ్చుకుంటూ వెళ్తే రాష్ట్రానికి జరిగిన నష్టం నుంచి వీలైనంత త్వరగా కోలుకుని మళ్లీ నంబర్ 1గా ఎదుగుతామని చంద్రబాబు అన్నారు. సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం వేగంగా వ్యాప్తి చెందుతుండటం మంచి పరిణామం కాదని ఆయన హితవుపలికారు. ప్రకాశం బ్యారేజీ ధ్వంసం చేయాలని కుట్రపన్నిన వాళ్లు వరదల్లో తమ పనితీరును విమర్శిస్తారా అని మండిపడ్డారు. ప్రజలు స్వచ్ఛందంగా స్పందించి రూ.400 కోట్ల పైన విరాళాలు ఇచ్చారని సీఎం తెలిపారు. తిరుమల బ్రహ్మోత్సవాలు, దసరా ఉత్సవాలు ఇంత కన్నులపండువగా గత 5ఏళ్లలో ఎప్పుడైనా జరిగాయా ప్రశ్నించారు. ప్రసాదాలు మొదలు అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. తమకు ఎవరి వల్ల లాభం జరుగుతుందో ప్రజలు ఆలోచిస్తే అది సుస్థిర ప్రభుత్వానికి నాంది పలుకుతుందని చంద్రబాబు తెలిపారు.