CM Chandrababu in Assembly :కర్నూలులో త్వరలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు అవుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. లోకాయుక్త, ఏపీ హెచ్‌ఆర్సీ తదితర సంస్థలు కూడా అక్కడే ఉంటాయని తెలిపారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి కావాలని సీఎం ఆకాంక్షించారు. గత ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం అన్నారు.
తెలుగు గంగ, హంద్రీనీవా, గాలేరు-నగరి లాంటి ప్రాజెక్టులను అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. నదుల అనుసంధానంతో అన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని అన్నారు. సీమకు తాగు, సాగునీటి సమస్య లేకుండా చేస్తామని ఎయిర్‌పోర్ట్స్, విద్య, పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు. కొప్పర్తి, ఓర్వకల్ క్లస్టర్ల కోసం 5వేల కోట్లు కేటాయించినట్లు సీఎం స్పష్టం చేశారు.
ఆడబిడ్డల జోలికొస్తే వదిలే ప్రసక్తే లేదు:ఆడబిడ్డలపై ఇష్టానుసారంగా వైస్సార్సీపీ నేతలు పోస్టులు పెట్టిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఏపీ డిజిటల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిందని కానీ అందులో వైఎస్సార్సీపీ కార్యకర్తలనే ఉద్యోగులుగా నియమించారని తెలిపారు. డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగుల చేత అసభ్యంగా పోస్టులు పెట్టించారని ఇక భవిష్యత్‌లో ఎవరైనా ఆడబిడ్డల జోలికొస్తే ఏం చేయాలో చేసి చూపిస్తామని హెచ్చరించారు. ఆడబిడ్డల కోసం దేశమంతా అధ్యయనం చేసి చట్టాలు చేశామని నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగించేలా లా అండ్ ఆర్డర్ ఉంటుందని తెలిపారు.
ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్‌స్టేషన్: రాష్ట్రంలో పోలీసు శాఖను బలోపేతం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. పోలీసులు వేరేవాళ్లపై ఆధారపడకుండా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. 2,812 కొత్త పోలీసు వాహనాల కొనుగోలుకు నిధులు మంజూరు చేశామని కాని గత ప్రభుత్వం పోలీసులకు బకాయిలు పెట్టిందని తెలిపారు. వీలైనంత త్వరలో వాటిని చెల్లిస్తామని తెలిపారు. ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయబోతున్నామని సీఎం అన్నారు.
అవిశ్వాస తీర్మానాలపై గడువు రెండేళ్లకి కుదింపు - క్యాబినెట్ సంచలన నిర్ణయాలు