Kethireddy Interesting Comments : శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత, కేతిరెడ్డి వెంక్రటామిరెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ సర్కార్ హయాంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిని ఆయన తాజాగా ఖండించారు. టీడీపీ నేతల ఇళ్లపై, పార్టీ కార్యాలయంపై దాడి ముమ్మాటికీ తప్పేనని వ్యాఖ్యానించారు. ఈ మేరకు కేతిరెడ్డి ఓ మీడియాతో మాట్లాడుతూ అవతలి వ్యక్తి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా దాడులకు పాల్పడటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.
తాడిపత్రిలో మా చిన్నాన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి మీదకు వెళ్లినప్పుడు కూడా తప్పు అని చెప్పానని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో పోరాటాలు చేయాలి లేదా చర్చించి పరిష్కరించుకోవాలని అన్నారు. దాడులకు వెళ్లడం ద్వారా ఒక తప్పుడు విధానాన్ని నేర్పిస్తున్నట్లు అవుతుందని చెప్పారు. ఈ తరహా వంటివి పార్టీ నిర్ణయాలని అనుకోవడం లేదని పేర్కొన్నారు. ఆ సమయంలో భావోద్వేగానికి గురయ్యో లేదా జగన్‌ను ప్రసన్నం చేసుకోవడానికో వారు దాడులకు పాల్పడి ఉంటారని కేతిరెడ్డి వ్యాఖ్యానించారు.
చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యల గురించి స్పష్టత లేదని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఒకవేళ నిజంగా అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే, పార్టీ అధిష్ఠానం తప్పని చెప్పి ఉంటే బాగుండేదని చెప్పారు. కాని అది జరగలేదన్నారు. దాంతో చంద్రబాబును రాక్షసుల్లా హింసిస్తున్నారనే భావన ప్రజల్లోకి వెళ్లినట్లు పేర్కొన్నారు. అవతలి వారు ఎంతలా తిడుతున్నా, హేళన చేసినా చంద్రబాబు చాలా ఓపికగా ఉన్నారని వ్యూహాత్మకంగా వ్యవహరించారని కేతిరెడ్డి వివరించారు.
Kethireddy on Pawan Kalyan : చంద్రబాబును అరెస్ట్ చేయడం, పవన్ కల్యాణ్‌ను అనవసరంగా తిట్టడం టీడీపీ, జనసేనలు ఏకం కావడానికి ఉపయోగపడిందని కేతిరెడ్డి పేర్కొన్నారు. ఆ రెండు పార్టీల్లోని కార్యకర్తలు ఒక్కతాటిపైకి వచ్చి పనిచేసేలా చేసిందని విశ్లేషించారు. రాజకీయాల్లో పవన్ కల్యాణ్‌ది ఓ సక్సెస్ స్టోరీ అని కేతిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.