CM Revanth about Sonia gandhi and Sushma Swaraj : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను సికింద్రాబాద్ పరేడ్ మైదానంతో ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించి ఉత్సవాలను ప్రారంభించారు. ఓపెన్ టాప్ జీపులో పేరేడ్ ఏర్పాట్లను పరిశీలించి, అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. వివిధ పోలీసు బలగాలు కవాతు నిర్వహించారు. రాష్ట్ర అధికార గీతం జయ జయహే తెలంగాణ గీతాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి ప్రసంగించడంతో పాటు సోనియాగాంధీ పంపించిన సందేశాన్ని ప్రదర్శించారు. రాష్ట్ర గీతం ఆవిష్కరణ సందర్భంగా కవి అందెశ్రీ భావోద్వేగానికి లోనయ్యారు.
స్వేచ్ఛ తెలంగాణ జీవన శైలిలో భాగమని బానిసత్వాన్ని తెలంగాణ భరించదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం తెలంగాణ ప్రజల తత్వమన్న సీఎం, ఆకలినైనా భరిస్తాం కానీ, స్వేచ్ఛను హరిస్తే సహించమన్నారు. దాశరథి చెప్పినట్టు తెలంగాణ అమాయకపు నెరజాణే కానీ, అన్యాయం జరిగితే తిరగబడే నైజం కూడా ఉందన్నారు. సంక్షేమం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ భరించదన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో స్వేచ్ఛ పునరుద్ధరణకు మొదటి ప్రాధాన్యత ఇచ్చామని, ముళ్ల కంచెలు, ఇనుప గోడలు తొలగించామని సీఎం తెలిపారు.
మేము సేవకులం తప్ప పాలకులం కాదు : పాలకులు, పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టి, మున్సిపల్ కౌన్సిలర్ నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉండే పాలన తెచ్చామని సీఎం రేవంత్ చెప్పారు. తాము సేవకులం తప్ప పాలకులం కాదన్న నిజాన్ని నిరూపించామని, ప్రగతి భవన్‌ను మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌గా పేరు మార్చి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని వివరించారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల సమస్య నేరుగా విని, పరిష్కరిస్తున్నామన్నారు. సచివాలయంలోకి సామాన్యులు వచ్చే పరిస్థితి తెచ్చామని, ఇందిరాపార్కులో ధర్నాచౌక్‌కు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చామని, తమ నిర్ణయాల్లో లోటుపాట్ల సమీక్షకు అవకాశం ఇస్తున్నామన్న సీఎం, తప్పులు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
తామే సర్వ జ్ఞానులం అన్న భ్రమలు లేవని, అందరి సలహాలను, సూచనలను స్వీకరించి, చర్చించి ముందుకు వెళుతున్నామన్న రేవంత్ రెడ్డి, ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు ఇవ్వాలన్నది ప్రభుత్వ ప్రాధాన్యతలని పునరుద్ఘాటించారు. జూన్ 2వ తేదీ 2014న తెలంగాణ భౌగోళిక ఆకాంక్ష నెరవేరిందని, అయితే అంతటితో లక్ష్యాన్ని చేరినట్టు కాదని సీఎం రేవంత్ అన్నారు. ఉద్యమ లక్ష్యాలు, అమరుల ఆశయాలు సాధించిన నాడే తెలంగాణ సాధనకు సార్థకత వస్తుందన్నారు. దశాబ్ద కాలంలో ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేర్చడంలో మనం ఎక్కడ ఉన్నాం అన్నది సమీక్షించుకోవాల్సిన సందర్భమే ఈ దశాబ్ది ఉత్సవమని ఆయన అన్నారు.
పదేళ్ల పాలనలో తెలంగాణ వందేళ్ల విధ్వంసం :చరిత్రను సమీక్షించుకున్నప్పుడే భవిష్యత్‌కు పునాదులు వేసుకోగలమన్న ముఖ్యమంత్రి రేవంత్, తప్పొప్పులను గుర్తించి, దిద్దుబాటు చేసుకోవడం విజ్ఞుల లక్షణమన్నారు. పదేళ్ల పాలనలో తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురైందని వ్యాఖ్యానించారు. భౌతిక విధ్వసం మాత్రమే కాదని, తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛపై దాడి జరిగిందన్నారు. సామాజిక న్యాయం మేడిపండు చందంగా మారిందని, ప్రజలందరికీ చెందాల్సిన రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరిందని ధ్వజమెత్తారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, ఆర్థిక వ్యవస్థ విధ్వంసానికి గురయ్యాయన్నారు. అయితే ఇదంతా గతమని, ప్రజల కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో ఉందని సీఎం అన్నారు.